ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు విద్యశాఖ కసరత్తు ప్రారంభించింది. నెలవారీ సమీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు విద్యశాఖ కసరత్తు ప్రారంభించింది. నెలవారీ సమీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఇందులో బాగంగా జిల్లాలో ఉన్న యలమంచిలి, పాడేరు, విశాఖపట్నం డివిజన్లలో విద్యాశాఖాధికారులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్‌పీలతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రతినెలా 16, 17, 18 తేదీల్లో ఈ మూడు డివిజన్లలో తప్పని సరిగా సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేశారు.
తరగతి గదుల నిర్మాణం, మధ్యహ్న భోజన పథకం, యూనిఫామ్స్, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించడం, అనాథ పిల్లల్ని ఆర్‌ఎస్‌టీసీల్లో చేర్చడం, పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి నిర్వహణ, విద్యాహక్కు చట్టం, పాఠ్యపుస్తకాల పంపిణీ, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయులు పనిచేసేలా చర్యలు చేపట్టనున్నారు.
ఈ సమావేశాలకు ప్రతినెలా జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ), రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం) ప్రాజెక్ట్ అధికారి(పీఓ) తప్పని సరిగా హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం పాడేరు డివిజన్‌కు సంబంధించి పాడేరు, 19న యలమంచిలి, 20న విశాఖ డివిజన్‌లలో విద్యాశాఖాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.