breaking news
Rajiv vidyamisan
-
ఎదురుచూపులు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది జిల్లాలోని పేద విద్యార్థుల దుస్థితి. విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేసేందుకు ఏడాదిన్నర క్రితం నిధులు మంజూరైనా నేటికీ ఆ నిధులు పాఠశాలల ఖాతాలకు జమ కాలేదు. రాజీవ్ విద్యామిషన్ నిర్వాకంతో జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫాంల పంపిణీ వ్యవహారం నేటికీ ఒక కొలిక్కిరాలేదు. ఇప్పటికీ ఇంకా జిల్లాలో 444 పాఠశాలలకు అసలు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు సంబంధించిన నిధులు రాజీవ్ విద్యామిషన్ నుంచి విడుదల కాలేదు. అంటే సుమారు 39 వేల మంది విద్యార్థులకు రూ 1,23,33,675 నేటికీ చేరలేదు. అదేవిధంగా 13 మండల్లాలోని 315 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు కుట్టుకూలి చార్జీలు రూ 22,44,000 ఇప్పటికీ పాఠశాల జీతాల ఖాతాలకు జమ కాలేదు. తాజా అంచనా ప్రకారం జిల్లాలో ఇప్పటికీ ఇంకా సుమారు 39 వేల మందికి యూనిఫాంలు అందలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతోంది. ప్రభుత్వ రంగ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించి ఆ మేరకు నిధులు విడుదల చేస్తోంది. ఒక్కో యూనిఫాంరూ 200 చొప్పున ప్రతి విద్యార్థికి రెండు జతల కోసం రూ 400 విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో వస్త్రం కొనుగోలుకు రూ 160, యూనిఫాం కుట్టినందుకు రూ 40 కుట్టుకూలి కింద విడుదల చేస్తున్నారు. అయితే ఏ ముహూర్తాన యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించారో గానీ విద్యార్థులకు ఏనాడూ విద్యా సంవత్సరం ఆరంభంలో పంపిణీ చేసిన దాఖలాలేదు. అధికారుల కాసుల కక్కుర్తి విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పాఠశాలల యాజమాన్య కమిటీలు వస్త్రం కొనుగోలు చేసి యూనిఫాంలు కుట్టించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో రాష్ట్రస్థాయిలోనే లాలూచి వ్యవహారాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలే వివిధ సంస్థలతో లాలూచి పడి ఆ సంస్థల నుంచే యూనిఫాంలు కొనుగోలు చేయాలని తీర్మానాలు జారీ చేస్తుండడంతో విద్యార్థులకు నాణ్యతలేని యూనిఫాంలే దిక్కవుతున్నాయి. గత ఏడాది జరిగిందిదీ.. జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరంలో 2,56,151 మందికి 10.24 కోట్ల రూపాయలతో రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ యూనిఫాంలు ఇస్తారు. ఎస్సీ బాలురు 42,564 మంది, ఎస్టీ బాలురు 8,654, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలురు 6,976 మందికి యూనిఫాంలు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం లభించింది. అయితే అన్ని పాఠశాలలకు యూనిఫాంల నిధులు విడుదల కాలేదు. గత సంవత్సరం పాఠశాలలకు నిధుల విడుదల బాధ్యత జిల్లా ప్రాజెక్టు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయం స్వీకరించింది. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని పాఠశాలల యాజమాన్య కమిటీల బ్యాంకు ఖాతాల వివరాలను రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయానికి పంపించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ విద్యామిషన్ ఎస్పీడీ కార్యాలయం నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో 444 పాఠశాలల విద్యార్థులకు నేటికీ యూనిఫాంలు అందలేదు. ఈ పాఠశాలల్లో మొత్తం సుమారు 39 వేల మందికి రూ 1,23,33,635 నేటికీ విడుదల కాలేదు. యూనిఫాంల కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. కుట్టుకూలి చార్జీలు కూడా.. జిల్లాలోని 444 పాఠశాలలకు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు నిధులు విడుదల చేయకుండా తమ చేతకానితనాన్ని బయట పెట్టుకున్న అధికారులు 315 పాఠశాలల్లోని 28,046 మంది విద్యార్థులకు కుట్టుకూలి చార్జీలు కూడా విడుదల చేయలేదు. దొనకొండ మండలంలోని 69 పాఠశాలలకు రూ 4.27 లక్షలు, సంతమాగులూరు మండలంలోని 52 స్కూళ్లకు రూ 4.60 లక్షలు, చినగంజాం మండలంలోని 18 పాఠశాలలకు రూ 1.51 లక్షలు, వేటపాలెంలోని 48 పాఠశాలలకు రూ 3.99 లక్షలు, త్రిపురాంతకంలోని 11 పాఠశాలలకు రూ 1.22 లక్షలు, యర్రగొండపాలెంలోని 25 పాఠశాలలకు రూ 33,440, పెద్దారవీడు మండలంలోని 4 పాఠశాలలకు రూ 58,640, హనుమంతునిపాడు, కనిగిరి, మద్దిపాడు, మార్కాపురం తదితర మండలాలకు ఒక్కోదానికి 10 వేల రూపాయలలోపు విడుదల చేయాల్సి ఉంది. అధికారులు ఇప్పటికైనా పాఠశాలలకు యూనిఫాం నిధులు విడుదల చేసి పేద పిల్లలకు యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
విద్యాశాఖ నెలవారీ సమీక్షలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు విద్యశాఖ కసరత్తు ప్రారంభించింది. నెలవారీ సమీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఇందులో బాగంగా జిల్లాలో ఉన్న యలమంచిలి, పాడేరు, విశాఖపట్నం డివిజన్లలో విద్యాశాఖాధికారులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్పీలతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రతినెలా 16, 17, 18 తేదీల్లో ఈ మూడు డివిజన్లలో తప్పని సరిగా సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేశారు. తరగతి గదుల నిర్మాణం, మధ్యహ్న భోజన పథకం, యూనిఫామ్స్, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించడం, అనాథ పిల్లల్ని ఆర్‌ఎస్‌టీసీల్లో చేర్చడం, పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి నిర్వహణ, విద్యాహక్కు చట్టం, పాఠ్యపుస్తకాల పంపిణీ, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయులు పనిచేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాలకు ప్రతినెలా జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ), రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ప్రాజెక్ట్ అధికారి(పీఓ) తప్పని సరిగా హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం పాడేరు డివిజన్‌కు సంబంధించి పాడేరు, 19న యలమంచిలి, 20న విశాఖ డివిజన్లలో విద్యాశాఖాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. -
బంగారుబాతు ‘కస్తూర్బా’
పాడేరు, న్యూస్‌లైన్: గిరిజన సంక్షేమ గురుకు లం సొసైటీ, రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఏజెన్సీలోని నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) స్పెషలాఫీసర్ పోస్టుకు డిమాండ్ పెరిగింది. బంగారు బాతుల్లాంటి వీటి బాధ్యతలు చేపట్టేందుకు ఉపాధ్యాయులు పోటీపడుతున్నారు. పైరవీలు చేపడుతున్నారు. డ్రాపౌట్ గిరిజన బాలికల అక్షరాస్య త కోసం మన్యంలో 11 విద్యాలయాలు ఉన్నా యి. ఒక్కోపాఠశాలలో 200 మంది చొప్పున మొత్తం 2200 మంది బాలికలు వీటిల్లో విద్యనభ్యసిస్తున్నారు. చదువుతోపాటు భోజనం, వసతి సౌకర్యాలు వీరికి కల్పిస్తున్నారు. ఒక్కో బాలికకు నెలకు రూ.750 మెస్ చార్జీలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలతో పోల్చుకుంటే వీటిల్లో బాగా మిగులుతుందన్న వాదన ఉంది. అంతే కాకుండా వీటిల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్పెషలాఫీసర్ పోస్టుతో నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని యోచిస్తున్నవారూ ఉన్నారు. ఈమేరకు మూడేళ్ల నుంచి పైరవీలతోపాటు రాజకీయాలూ చోటుచేసుకుంటున్నాయి. రెండేళ్ల నుంచి ఎస్జీటీ మహిళా టీచర్లే స్పెషలాఫీసర్లుగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, ఆపైస్థాయి ఉపాధ్యాయులు, పదవీ విరమణ పొందిన వారికి నియమించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఏజెన్సీలోని అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఉదాహరణకు పాడేరు,జి.మాడుగుల, డుంబ్రిగుడ పాఠశాలల్లో ఎస్జీటీలే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇలా డిప్యుటేషన్‌తో నిర్దేశిత పాఠశాలల్లో విద్యాబోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా పాఠశాలలు మూతపడిన పరిస్థితులునెలకొన్నాయి. గత ఏప్రిల్ 26 నాటికే స్పెషలాఫీసర్ల డిప్యుటేషన్ రద్దయింది. అయినా ఇప్పటికీ పాతవారే కొనసాగుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ల నియామకానికి ఓ ఉన్నతాధికారి చర్యలు చేపట్టడంతో పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్జీటీలు కూడా ఈ విద్యాసంవత్సరంలో కొనసాగడానికి పైరవీలు చేపట్టారు. పారదర్శకంగానే నియామకాలు ఏజెన్సీలోని కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ల నియామకం నిబంధనల మేర కు పారదర్శకంగానే జరుపుతామని ఐటీడీఏ ఇన్చార్జి పీవో వై.నర్సింహారావు‘ న్యూస్‌లైన్’కు తెలిపారు. డిప్యుటేషన్‌పై నియామకాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని చెప్పారు.