చంద్రబాబును తరిమికొడతారు

Dharmana Prasada Rao Fires On Chandrababu - Sakshi

ఉద్యమానికి ఉప్పెనలా సిద్ధంగా ఉన్న మహిళలు 

మహిళా కన్వీనర్ల సమావేశంలో  ధర్మాన

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తామని 2014 ఎన్నికల సమయంలో బూటకపు హామీలిచ్చి వాటన్నింటినీ తుంగలొ తొక్కేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ బూత్‌కమిటీ మహిళా కన్వీనర్ల సమావేశం శనివారం పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.వి.పద్మావతి అధ్యక్షతన జరిగింది. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా దివంగనేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళల ఓట్లు దండుకోవడానికి ‘అక్కచెల్లెమ్మల్లారా నేను మారాను.. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాను.. నన్ను నమ్మండి’ అని ప్రాధేయపడితే ఓట్లు వేసిన మహిళలను నట్టేట ముంచాడని దుయ్యబట్టారు.

 పిల్లనిచ్చిన మామకే ముప్పు తిప్పలు పెట్టిన బాబుకు అమాయకులైన మహిళలను మోసం చేయడం పెద్ద విచిత్రం కాదన్నారు. డ్వాక్రా రుణాలు రూ.3వేలు ఇచ్చినందుకు సన్మానం చేయాలా? కట్టాల్సిన బకాయిలు లక్షల రూపాయలకు చేరినందుకు తగిన బుద్ధి చెప్పాలా అని మహిళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ గెలుపులో మహిళలే కీలకమన్నారు. 279 మంది మహిళా కన్వీనర్లు ఒక్కొక్కరూ 10 మంది సభ్యులతో కలిపి మొత్తం 2790మందితో కూడిన కమిటీని మరింత బలంగా తయారుచేసి పార్టీ విజయానికి దోహదపడాలన్నారు. నవరత్న పథకాలను అన్ని వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తినడానికి తిండిలేక ఎంతోమంది నిరుపేదలు ఇబ్బందులు పడుతుంటే టెక్నాలజీ పేరుతో ప్రచార ఆర్భాటం చేస్తున్న బాబుని ప్రజలు క్షమించరన్నారు. బస్సుచార్జీలు, విద్యుత్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ ధరలతో పాటు పన్నులు పెంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.  

మహిళా శక్తికి మించినది లేదు: కృష్ణదాస్‌
సమాజంలో మహిళలకి మించిన గొప్పవారు ఎవరూ ఉండదని, కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలున్న వ్యక్తులని వైఎస్సార్‌ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. షర్మిలమ్మ 3180 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. అంత శక్తి సామర్థ్యాలున్న మహిళలు వైఎస్సార్‌సీపీని గెలిపించడం పెద్ద విశేషం కాదన్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి టీడీపీని కంగుతినిపించాలన్నారు. 

జగన్‌తోనే మహిళా సాధికారత: దువ్వాడ
మహిళాసాధికారతపై ఉద్యమాలు జరుగుతుంటే దానికి తూట్లు పొడిచేవిధంగా చంద్రబాబునాయుడు వ్యవహరించడం దారుణమని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. ఏ సంక్షేమ పథకాన్నైనా మహిళల పేరుపైనే ఇవ్వాలని తొలిసారిగా ప్రతిపాదించి మహిళలకు చేయూతనిచ్చింది దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు.  అనంతరం వైఎస్సార్‌సీపీ అధిష్టానం తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా, నిస్వార్థంతో చేస్తామని కన్వీనర్లు ప్రమాణం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, మహిళా ప్రధాన కార్యదర్శి అంబటి అంబిక, రాష్ట్ర మహిళా కార్యదర్శి టి.కామేశ్వరి, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా అలివేలు మంగ, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షురాలు పి.సుగుణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ సతీమణి పిరియా విజయమ్మ, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు సతీమణి ధర్మాన సుశ్రీ, మూల కృష్ణవేణి, రాధారాణి, టెక్కలి ఎంపీటీసీ సత్తారు ఉషారాణి, మూకళ్ల సుగుణా, పైడి భవానీ,  గార మండల అధ్యక్షురాలు సుగ్గు లక్ష్మినర్సమ్మ, పైడి భవానీ, మహిళా కన్వీనర్లు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top