కారు డిక్కీలో యువకుడి మృతదేహం | dead body in car dicky | Sakshi
Sakshi News home page

కారు డిక్కీలో యువకుడి మృతదేహం

Feb 27 2014 3:28 AM | Updated on Aug 21 2018 5:46 PM

కారు డిక్కీలో యువకుడి మృతదేహం - Sakshi

కారు డిక్కీలో యువకుడి మృతదేహం

జాతీయ రహదారిపై బూరెడ్డిపల్లి స్టేజీ దగ్గర ఓ కారు డిక్కీలో ఉన్న గుర్తుతెలియని యువకుడి (30) మృతదేహాన్ని బుధవారం రాత్రి సుమారు ఎనిమిది గంటలకు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.

 జడ్చర్ల :  జాతీయ రహదారిపై బూరెడ్డిపల్లి స్టేజీ దగ్గర ఓ కారు డిక్కీలో ఉన్న గుర్తుతెలియని యువకుడి (30) మృతదేహాన్ని బుధవారం రాత్రి సుమారు ఎనిమిది గంటలకు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే... జడ్చర్ల శివారులోని యగ్నేష్ విరాట్ హోటల్ సమీపంలో ఏపీ 28 బీకే 0369 నంబర్ గల వర్ణ కారు నిలిపి ఉండగా అనుమానం వచ్చి వీఆర్‌ఓ బుచ్చమ్మ గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి  డీఎస్పీ మల్లికార్జున, సీఐ జంగయ్య, ఎస్‌ఐ చంద్రమౌళి చేరుకుని పరిశీలించగా డిక్కీలో యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మెడలో మెరున్ కలర్ పూసలదండ, కాళ్లకు ఖరీదైన బూట్లు, కుడిచేతికి పగడంతో వెండి ఉంగరం, ప్యాంట్‌కు నల్లటి బెల్టు ఉన్నాయి.

 

తలపై రాడ్‌తో తీవ్రంగా కొట్టడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చొక్కా రక్తంతో తడిసిపోగా కాళ్లు, చేతులను ప్లాస్టిక్ ప్యాకింగ్ తాళ్లతో కట్టి వేసి ఉంది. దుండగులు మంగళవారం రాత్రే ఎక్కడో హత్య చేసి కర్నూల్ వైపు తరలించే క్రమంలో కారు మొరాయించడమో, మరేదైనా కారణంతోనో ఇక్కడ వదలి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.

 

2009 మోడల్ అయిన ఈ వాహనం మహ్మద్‌అహ్మద్ పేరుతో హైదరాబాద్‌లో రిజిస్ట్రీ కాగా, దీనిపై టీవీఎస్ క్రెడిట్ సర్వీస్‌లో రుణం తీసుకుట్టు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కలకలం రేపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement