ఈ ‘లెక్క’కు ఓ చిక్కుంది | costs of election candidates | Sakshi
Sakshi News home page

ఈ ‘లెక్క’కు ఓ చిక్కుంది

Jun 23 2014 2:37 AM | Updated on Aug 14 2018 4:34 PM

ఈ ‘లెక్క’కు ఓ చిక్కుంది - Sakshi

ఈ ‘లెక్క’కు ఓ చిక్కుంది

ఎన్నికలు జరిగి సుమారు ఒకటిన్నర నెలలైంది. అభ్యర్థులు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు మాత్రం తేలడం లేదు. ముందెన్నడూ లేని రీతిలో కోట్లు కుమ్మరించిన అభ్యర్థులు..

సాక్షి, కాకినాడ :ఎన్నికలు జరిగి సుమారు ఒకటిన్నర నెలలైంది. అభ్యర్థులు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు మాత్రం తేలడం లేదు. ముందెన్నడూ లేని రీతిలో కోట్లు కుమ్మరించిన అభ్యర్థులు.. లక్షల్లో చిట్టాపద్దులు రాసేందుకు ఆపసోపాలు పడ్డారు. నానాతంటాలు పడి వీరు అప్పగించిన లెక్కలను మదించడంలో అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గత నెల ఏడున సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, జై సమైక్యాంధ్ర వంటి పార్టీలతో పాటు పెద్దఎత్తున ఇండిపెండెంట్లు తలపడ్డారు. మూడు పార్లమెంటు స్థానాల కోసం 50 మంది పోటీ పడగా, 19 అసెంబ్లీ స్థానాలకు 250 మంది బరిలో నిలిచారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు 28 లక్షలు, ఎంపీ అభ్యర్థులకు   రూ.70 లక్షలకు మించి వ్యయం చేయరాదని ఎన్నికల సంఘం నిర్దేశించింది.
 
 నామినేషన్ నాటి నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు ఏరోజుకారోజు ఎన్నికల ఖర్చుల వివరాలను రిటర్నింగ్ అధికారులకు తెలియజేసేవారు. ఎన్నికల అనంతరం విజేతలుగా నిలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పరాజితులైన అభ్యర్థులు ఎన్నికల్లో చేసిన ఖర్చుల వివరాలతో కూడిన చిట్టాపద్దులు సమర్పించేందుకు మాత్రం జూన్ 18కి గడువు విధించారు. అభ్యర్థులు సమర్పించిన చిట్టాపద్దులను పరిశీలించి జూన్ 19కల్లా ఎన్నికల కమిషన్‌కు తుది నివేదిక సమర్పిస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనంతగా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం కోట్ల రూపాయలు కుమ్మరించారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము చేసిన ఖర్చులను లక్షల్లో కుదించి తుది జాబితాలను సమర్పించారు.
 
 జిల్లాలో 31 మంది అభ్యర్థులు మినహా ప్రధాన పార్టీ విజేతలతో పాటు బరిలో నిలిచిన మిగిలిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫార్మెట్లలోనే రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వాటిని రిటర్నింగ్ అధికారులు ఆడిట్ బృందాలతో పరిశీలన జరిపి జిల్లా ఎన్నికల సెల్‌కు అప్పగించారు. గత మూడు రోజులుగా ఏరోజుకారోజు తుది జాబితాలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తామంటూ చెబుతున్నప్పటికీ, సాయంత్రమయ్యేసరికి ఇంకా కొలిక్కి రాలేదంటూ అధికారులు దాట వేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల ఖర్చుల జాబితాలను మదింపు చేసేందుకు సుమారు 20 మందితో కూడిన సిబ్బంది పొద్దస్తమానం కుస్తీ పడుతున్నా లెక్కలు మాత్రం తేల్చలేకపోతున్నారు.
 
 అభ్యర్థులు రోజు వారీగా చేసిన ఖర్చులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు సమర్పించిన ఖర్చుల వివరాలు, అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకుంటున్నారు. అభ్యర్థులు చేసిన ప్రతీ ఖర్చుకు ఓఫార్మెట్ ఉండడంతో వాటిని క్రోడీకరిస్తూ.. వ్యయాన్ని సరిపోల్చుకోవడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఒకవైపు ఎన్నికల సంఘం తరుముతున్నప్పటికీ.. తేలని లెక్కలు సమర్పిస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామోననే భయం అధికారులను వెన్నాడుతోంది. శనివారం ఎట్టి పరిస్థితుల్లోను తుది జాబితాలను వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు ఆనక చేతులెత్తేశారు. ఇంకెంత సమయం పడుతుందో వారికే తెలియని పరిస్థితి నెలకొంది. పైకి మాత్రం ఈ నెల 23కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement