13న కాంగ్రెస్ జైత్రయాత్ర | congress is victory of telangana formation | Sakshi
Sakshi News home page

13న కాంగ్రెస్ జైత్రయాత్ర

Nov 4 2013 2:03 AM | Updated on Mar 18 2019 9:02 PM

‘తెలంగాణ ఇచ్చేది మేమే. తెచ్చేది మేమే.. అన్న మాటను నిలబెట్టుకున్నాం. ఈ విషయాన్ని తెలంగాణ వాదులు గుర్తించాలి.

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ :  ‘తెలంగాణ ఇచ్చేది మేమే. తెచ్చేది మేమే.. అన్న మాటను నిలబెట్టుకున్నాం. ఈ విషయాన్ని తెలంగాణ వాదులు గుర్తించాలి. ఇందులో భాగంగా ఈనెల 13న నిర్మల్‌లో కృతజ్ఞత సభ, జైత్రయాత్ర, విజయోత్సవ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ వాదులు  ఈ కార్యక్రమాల్లో భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి’ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేశారని, మాట తప్పకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు. యూపీఏ మిత్ర పక్షాలు, సీడబ్ల్యూసీ సమావేశంలో, కేబినెట్ తెలంగాణ తీర్మానం చేశారని, ఇందుకు సహకరించిన అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఈనెలలో జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు.

జైత్రయాత్ర కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ కమిటీ నాయకులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అంతకుముందు కృతజ్ఞత సభ పోస్టర్‌ను విడుదల చేశారు. తెలంగాణ ఏర్పాటు గురించి ప్రజలకు తెలిసేవిధంగా బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్, మార్కెట్‌లలో, ముఖ్య కూడళ్లలో వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపధ్యక్షుడు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మల్లేపూల నర్సయ్య, సుఖేందర్, అశోక్, భోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement