క్వారంటైన్‌ నుంచి వెళ్లేటప్పుడు రూ. 2,000 సాయం

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

కోవిడ్‌–19 నివారణ  చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

ప్రతిరోజూ క్వారంటైన్‌లో ఒక్కొక్కరి భోజనంపై రూ.500 వ్యయం

పరీక్షల రోజువారీ సామర్థ్యం త్వరలో 4 వేలకు పెంపు

రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి

నిత్యావసరాల ధరలు పెరగకుండా నియంత్రించాలి

అరటి, పుచ్చకాయల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించాలి. రైతులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. వంట నూనెలు, నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. 

కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32 వేల మందికి పరీక్షలు త్వరగా పూర్తి చేయాలి. తర్వాత  మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహించాలి. ఏమాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా పరీక్షలు నిర్వహించి, మంచి వైద్యం అందించాలి.
–సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రొటోకాల్‌ పూర్తి చేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేదలకు కనీసం రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించాలని, ప్రతి వారం వాళ్లను వైద్యులు పరీక్షించేలా చూడాలని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు, నిత్యావసర సరుకుల అందుబాటుపై బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫ్రంట్‌ లైన్‌లో ఉన్న, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కోవిడ్‌ విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. 
కోవిడ్‌–19 నివారణ చర్యలు, వ్యవసాయ ఉత్పత్తులకు ధరలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

– క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలు బాగుండాలి. ప్రతి రోజూ ఒక్కో మనిషికి భోజనం మీద రూ.500 వ్యయం చేస్తున్నాం. రోజూ దుప్పటి మార్చడానికి అయ్యే వ్యయం కూడా ఇందులో ఉంది. ప్రతి రోజూ ప్రతి మనిషికి పారిశుధ్యం కోసం రూ.50, ఇతరత్రా ఖర్చుల కోసం మరో రూ.50 ఖర్చవుతోంది. 
– ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు తీసుకురావడానికి రూ.300, తిరుగు ప్రయాణం కోసం మరో రూ.300 ఖర్చు అవుతోంది. డబుల్‌ రూం లేదా సింగిల్‌ రూం ఇస్తున్నాం. 
– క్వారంటైన్‌ సెంటర్లలో ఇంకా ఏమేమి ఉండాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను దిగువ అధికారులకు పంపించాలి. 
– ప్రస్తుతం రోజుకు 2,100కు పైగా పరీక్షలు చేస్తున్నామని, నాలుగైదు రోజుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ట్రూనాట్‌ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు.
– ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top