
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి.. ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించబోతోంది. ఈ వ్యవస్థ ద్వారా ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు అని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామని, ప్రజల ఆశీర్వాదబలం వల్లే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు.
‘తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతోంది’అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.