
సాక్షి, అమరావతి: పదకొండో వేతన సవరణ కమిషన్ నివేదిక ఇంకా రానందున ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విధానం తరహాలోనే రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే వారికి సైతం పీఆర్సీ అమలు చేయాలని కోరారు.
అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ మధ్యంతర భృతిపై రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఆటంకంగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.