breaking news
Salary Amendment
-
మధ్యంతర భృతి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: పదకొండో వేతన సవరణ కమిషన్ నివేదిక ఇంకా రానందున ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విధానం తరహాలోనే రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే వారికి సైతం పీఆర్సీ అమలు చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ మధ్యంతర భృతిపై రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఆటంకంగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. -
‘మళ్లీ వేతన సవరణ డిమాండ్లు పంపవచ్చు’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సంఘాలు చేసిన న్యాయమైన సూచనలను ఏడో వేతన సంఘం ఆమోదించలేదని గుర్తించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు తాజాగా వేతన సవరణ డిమాండ్లను చేయవచ్చు. ఇటువంటి డిమాండ్లను కేబినెట్ కార్యదర్శి సారథ్యంలోని కార్యదర్శుల సాధికార కమిటీకి సచివాలయంగా పనిచేసేందుకు ఆర్థికశాఖ నియమించిన అమలు విభాగానికి నివేదించవచ్చు. ఇంప్లిమెంటేషన్ సెల్ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలపై ఇటీవల ఏడో వేతన సంఘం సమర్పించిన నివేదికలోని సిఫారసులను పరిశీలించి కేబినెట్ ఆమోదం కోసం పటిష్టపరచేందుకు సీఓఎస్ ఏర్పాటైన విషయం తెలిసిందే. -
బ్యాంకులు బంద్
సాక్షి, రాజమండ్రి : వేతన సవరణకోసం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెతో బుధవారం జిల్లాలోని 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 450కి పైగా శాఖలు మూత పడ్డాయి. సుమారు రూ.800 కోట్ల లావాదేవీలు స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగులకు పదో వేతన సవరణ 2012 నవంబరు నుంచి వర్తించ వలసి ఉండగా ఇప్పటి వరకూ ప్రభుత్వం అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. వేతనాలను 33 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజులు సమ్మె చేశారు. తర్వాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా వేతనాల పెంపును 25 శాతానికి, తర్వాత 23 శాతానికి తగ్గించి అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. అయినా కేంద్రం పట్టించుకోక పోవడంతో వారం రోజులుగా విధి నిర్వహణ అనంతరం నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు బుధవారం ఒకరోజు సమ్మె చేశారు. జిల్లాలో అత్యధికంగా సేవలు అందిస్తున్నవి ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంకు గ్రూపు శాఖలే. రాజమండ్రి, కాకినాడ, అమలాపురంతో పాటు మొత్తం 110 ఆంధ్రాబ్యాంకు, 113 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 40 స్టేట్ బ్యాక్ ఆఫ్ హైదరాబాద్ శాఖల్లో సమ్మె జరిగింది. ఇవి కాక ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 187 శాఖలు మూతపడ్డాయి. ఆయా బ్యాంకులకు అనుబంధంగా ఉండే ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంకు ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్లతో పాటు పలు యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించారు. పరిష్కారం కాకుంటే వచ్చే నెల రెండున మళ్లీ సమ్మె రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలలో బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ బ్యాంకుల ముందు సమావేశమై డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు.వేతన సవరణ అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాజమండ్రి కంబాలచెరువు మెయిన్ బ్రాంచి వద్ద రీజియన్ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు నిర సన వ్యక్తం చేశారు. ఐఎఫ్బీయూ రాజమండ్రి విభాగం కన్వీనర్ ఎన్.లక్ష్మీపతిరావు మాట్లాడుతూ తాము దిగి వచ్చినా కేంద్రం దిగి రావడం లేదన్నారు. ఇదే వైఖరి కొనసాగితే జోనల్ స్థాయిల్లో సమ్మెకు దిగుతామన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే సౌత్ జోన్ రాష్ట్రాల సమ్మెలో భాగంగా డిసెంబరు రెండున మరోసారి జిల్లాస్థాయిలో సమ్మె చేస్తామన్నారు. సమ్మెతో రాజమండ్రిలో రూ.200 కోట్లు, కాకినాడలో రూ.250 కోట్ల లావాదేవీలు స్తంభించినట్టుఅంచనా.