‘మీ ఇంటికి ఇసుక’ ఇదో మస్కా

‘మీ ఇంటికి ఇసుక’  ఇదో మస్కా


సీఎం ప్రకటన బోర్డులకే పరిమితం

 బడా కంపెనీలకు తరలిపోతున్న వేలాది క్యూబిక్ మీటర్లు

వెలుగు సిబ్బంది మాయాజాలం

 


చోడవరం: సొంతింటి కల నెరవేరాలంటే డబ్బులు సమకూర్చుకోవాల్సిన ఆతృతపోయి..ఇసుక కోసం తంటాలు పడాల్సిన దుస్థితి దాపురించింది.‘మీ ఇంటిముందుకే  ఇసుక’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక పాలసీ సామాన్యులకు శాపంగా మారింది. ఊరు పక్కనే నదుల్లో ఇసుక ఉన్నా.. కొనుగోలుకు వీలులేని పరిస్థితి. దీంతో పేద, మధ్యతరగతి గ్రామీణులు ఇల్లు క ట్టుకోవాలనే ఆలోచననే విరమించుకుంటున్నారు. గృహనిర్మాణాలే కాదు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు ఇసుక సమస్య ఎదురవుతోంది. ఐదు నెలలుగా గ్రామీణ జిల్లాలో కేవలం 10 శాతమే నిర్మాణాలు జరిగాయంటే ఈ రంగంపై ఇసుక ప్రభావం ఏమేరకు ఉంటున్నదీ అర్థమవుతోంది. గతంలో ఇసుక,  ధర అందరికీ అందుబాటులో ఉండేది.



నిర్మాణాలు జోరుగాసాగేవి. ఇందువల్లే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంది రమ్మ ఇళ్ల పథకం విజయవంతమైంది. నిరుపేద కూడా సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక పాలసీ, అధికార పార్టీ నాయకులకు, వెలుగు అధికారులకు వరంగా మారింది. డీఆర్‌డీఏ అధీనంలోని ‘వెలుగు’ పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా యి. నిబంధనల ప్రకారం డ్రాక్వా సంఘాలకు ఇచ్చామని చెబుతున్నా...అం తా డీఆర్‌డీఏ, వె లుగు అధికారులే నిర్వహిస్తున్నారు. ‘మీ ఇంటిముందుకే ఇసుక’ నినాదంలో ఎవరికి ఇసుక కావాలంటే వారు నేరుగా సమీపంలో ఉన్న మీ-సేవా కేంద్రంలో డబ్బులు చెల్లించి ఆ రసీదుతో ఇసుక పొందవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటనకు కిందస్థాయిలో పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. మీ-సేవా కేంద్రానికి వెళితే ఆ వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదు. మరి జిల్లాలో నడుస్తున్న ఇసుక రీచ్‌ల నుంచి తవ్వుతున్న రూ.కోట్లు విలువైన లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక ఎక్కడికి పోతుందనేది శేష ప్రశ్నగా ఉంటోంది. డీఆర్‌డీఏ, వెలుగు అధికారులతో కుమ్మక్కయి కొందరు బడా బిల్డర్లు వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించుకుపోతున్నారు. జిల్లా కేంద్రంలో స్టాక్ పాయింట్ పేరున రీచ్‌లో సగం తరలిస్తున్నారు. ఇలా సామాన్య ప్రజలకు ఇసుక దొరకడం లేదు. ఇందంతా డీఆర్‌డీఏ, వెలుగు అధికారుల మాయాజాలంగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో  శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, తాండవ, రావణాపల్లి వంటి పెద్దనదుల్లో ఇప్పటి వరకు సుమారు 100కుపైగా రీచ్‌లలో లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను తవ్వినా గ్రామాల్లో సామాన్యలకు దొరకడంలేదు. రీచ్‌ల వద్ద అంతా వెలుగు సిబ్బంది ఇష్టారాజ్యంగానే సాగుతుంది.



చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పెద్దేరు, తాచేరు, శారదా నదుల్లో ఇసుక రీచ్‌లు నడుస్తున్నా ఇక్కడ ప్రజలకు ఇసుక దొరకడంలేదు. తాజాగా జుత్తాడ రీచ్‌లో 17500 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుతున్నారు. ఇప్పటికే 11వేల క్యూబిక్ మీటర్ల ఇసుక బుకింగ్ అయిపోయింది. ఇందులో 5వేల క్యూబిక్‌మీటర్లు అధికారిక స్టాక్‌పాయింట్‌కు కాగా మిగతా 6వేల క్యూబిక్ మీటర్లు బడా బిల్టర్లు, కనస్ట్రక్షన్ కంపెనీలు బుక్‌చేసుకున్నాయి. అన్ని రీచ్‌లలోను ఇదే దందా నడుస్తోంది. ఇందంతా మీసేవలో జరగలేదు. నేరుగా డీఆర్‌డీఏ కార్యాలయంలోనే జరిగిపోయింది. ఇప్పుడు ఎవరికి ఇసుక కావాలన్నా డీఆర్‌డీఏ, వెలుగు అధికారుల చుట్టూ చక్కెర్లు కొట్టాల్సిన పరిస్థితి. అసలు మండల కార్యాలయాలే తెలియని గ్రామీణ ప్రజలకు ఇసుక కోసం విశాఖపట్నంలో ఉన్న డీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు సలామ్ కొట్టి, బతిమాలుకోవడం ఎలా తెలుసుంది. గ్రామం పక్కనే ఉన్న ఇసుక కొనుక్కోవాలంటే ఇన్ని పాట్లు పడాల్సి రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top