సాక్షి, మహబూబాబాద్: నాటు కోడి చనిపోతే 11 మందిపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మరిపెడ మండలం మూలమర్రితండా గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. కోడి చనిపోతే కేసు ఏంటి అనుకుంటున్నారా?.. అయితే ఇది చదివేయండి.
భూక్యా మంచా అనే వ్యక్తి ఓ నాటు కోడిని అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో.. ట్రాక్టర్ కింద పడి అది మరణించింది. దీంతో మంచా గుండె బద్ధలైంది. తన కోడిని చంపింది ఇసుక మైనింగ్ మాఫియాదేనంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అతని ఫిర్యాదుతో 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ సందర్భంగా బాధితుడు మంచా మాట్లాడుతూ.. మూలమర్రితండా శివారు పాలేరు వాగు నుంచి 11 మంది రెండు నెలలుగా నిత్యం అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించాడు. మైనర్లతో ఇసుక ట్రాక్టర్లను మూగ జీవాలపై నుంచే నడుపుతున్నారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన కోడిపై నుంచి ఓ ట్రాక్టర్ ఎక్కించి చంపారని తెలిపాడు.
మంచా ఫిర్యాదుతో పోలీసులకు కేసు నమోదు చేయని పరిస్థితి ఎదురైంది. ఇసుక ట్రాక్టర్ల యజమానులు వాంకుడోతు రవి, భూక్యా రఘు, వాంకుడోతు చింటు, తేజావత్ నెహ్రూ, తేజావత్ సక్రాం, తేజావత్ సీత్య, రమేశ్, భూక్యా వీరన్న, పి.హరీశ్, భూక్యా దేవా, గణేశ్‌పై మంగళవారం మరిపెడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోద చేశారు. విచారణ జరిపి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని మంచాను పోలీసులు పంపించేశారు. అయితే వ్యవహారంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఫిర్యాదుదారుడు చెబుతుండడం గమనార్హం.


