సెల్‌ టు హెల్‌ | Chandrababu Naidu Mobiles Blstings In Anganwadi Workers Hands East Godavari | Sakshi
Sakshi News home page

సెల్‌ టు హెల్‌

Jul 14 2018 6:37 AM | Updated on Apr 3 2019 3:52 PM

Chandrababu Naidu Mobiles Blstings In Anganwadi Workers Hands East Godavari - Sakshi

చార్జింగ్‌ పెడుతుండగా కాలిపోయిన సెల్‌ఫోన్‌

రాయవరం (మండపేట):  అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యం జరిగే కార్యకలాపాలను ఉన్నతాధికారులకు పంపించేందుకు ఇచ్చిన సెల్‌ఫోన్లు కార్యకర్తలకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే పలు కేంద్రాల్లోని కార్యకర్తల సెల్‌ఫోన్‌లు పేలిపోవడం, కాలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నాసిరకం సెల్‌ఫోన్లు సరఫరా చేయడం వలనే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అంగన్‌వాడీ వర్కర్లు ఆయాల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చార్జింగ్‌ పెడుతుండగా..
మండలంలోని మాచవరం గ్రామంలో 41వ కేంద్రం అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త సీహెచ్‌.సత్యవేణి శుక్రవారం తన ఇంట్లో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా కాలిపోయింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రభుత్వం సరఫరా చేసిన సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా దాని నుంచి పొగలు వచ్చి కాలిపోయింది. సెల్‌ఫోన్‌ నుంచి పొగలు రావడం గమనించిన సత్యవేణి, అప్రమత్తమై ఇంట్లోకి వచ్చే విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేయడంతో ప్రమాదం తప్పిందంటున్నారు. అదే అంగన్‌వాడీ కేంద్రంలో కానీ, చేతిలో ఉండగా కానీ పేలితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

గతంలోనూ పలు ఘటనలు
ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లకు ఏడాది క్రితం సెల్‌ఫోన్లు అందజేసింది. వీటి ద్వారా కుటుంబ నమోదు, రోజువారీ న్యూట్రిషన్‌ తీసుకునే వారి వివరాలను అప్‌లోడ్‌ చేయడం, గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు ఇవ్వాల్సిన టీహెచ్‌ఆర్‌(టేక్‌ హోమ్‌ రేషన్‌) నమోదు, గృహ సందర్శన తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు ఎప్పుటికప్పుడు సెల్‌ఫోన్‌ సహాయంతో ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. ఇంతటి సమాచారం ఆన్‌లైన్‌ చేయాల్సిన పరిస్థితుల్లో ఫోన్లు కాలిపోవడం, పేలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

గతంలో ఇటువంటి ఘటనలు రంగంపేట మండలంలో ఒకటి, రాజానగరం మండలంలో మూడు, రాజవొమ్మంగి మండలంలో ఒకటి చోటు చేసుకోగా, తాజాగా రాయవరం మండలం మాచవరంలో జరిగింది. ఒక కంపెనీకి చెందిన నాసిరకం సెల్‌ఫోన్లను అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇవ్వడం వలనే ఇలా ఫోన్లు కాలిపోవడం, పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నట్లు అంగన్‌వాడీ వర్కర్లు ఆయాల సంఘం నేతలు పేర్కొంటున్నారు. నిత్యం సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందించాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే తాము ఎలా పని చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement