జనం సొమ్ముతో జాతర

Chandrababu Naidu 100th Time Visits Visakhapatnam After CM - Sakshi

నేటి నుంచి విశాఖ ఉత్సవాలు

మూడోసారి ఈ – ఫ్యాక్టర్‌కే రూ.3.50 కోట్లకు అప్పగింత

అదనంగా వుడాపై రూ.50 లక్షలు, జీవీఎంసీపై రూ.87 లక్షలు భారం

మరోవైపు బహుమతులు, ఏర్పాట్ల పేరిట రూ.కోటికి పైగా వసూళ్లు

సాక్షి, విశాఖపట్నం: జనం సొమ్ముతో జాతర నిర్వహించేందుకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఓ వైపు ఆర్థిక లోటంటూ గగ్గోలు పెడుతూనే ఉత్సవాల పేరిట హంగామాకు కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారు. మరోవైపు హుద్‌హుద్‌ తుఫాన్‌ తర్వాత మొదలైన ఈ ఉత్సవాలు ఏటా అధికారులు, అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనడంతో మాత్రం సందేహం లేదు. గడిచిన మూడేళ్లుగా రాష్ట్ర ఉత్సవాలుగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. పైగా వరుసగా మూడేళ్లూ ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఒకే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఈ ఫ్యాక్టర్‌కే కట్టబెడుతూ ప్రభుత్వ స్థాయిలో పర్సంటేజ్‌లు దండుకుంటుంటే... స్థానికంగా ఏర్పాట్లు, బహుమతుల పేరిట నగరంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ అందినకాడికి వెనకేసుకుంటున్నారు.

జీవీఎంసీ, వుడాపై ఆర్థిక భారం
మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన విశాఖ ఉత్సవాలను ప్రభుత్వ పెద్దలు భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2015లో వరుసగా రెండుసార్లు ఈ ఉత్సవాలను జిల్లా యంత్రాంగమే నిర్వహించింది. 2016, 2017లలో ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నెత్తిన వేసుకున్నప్పటికీ హంగులు, ఆర్భాటాల పేరిట జిల్లా యంత్రాంగానికి ఖర్చు మాత్రం తడిసిమోపెడవుతోంది. ఈ ఏడాది కూడా జీవీఎంసీకి రూ.87 లక్షలు, వుడాకు రూ.50 లక్షలు చేతి చమురు వదులుతోంది. మూడు రోజుల ముచ్చట కోసం విద్యుత్‌ దీపాలంకరణల కోసం రూ.27.28 లక్షలు, పెయింటింగ్స్‌ కోసం రూ.60లక్షలను జీవీఎంసీ ఖర్చు చేసింది. ఇందుకోసం షార్ట్‌టైం టెండర్లు పిలిచి తాబేదార్లకు కట్టబెట్టారు. ప్లవర్‌షోతో పాటు స్థానికంగా ఉన్న కళాకారులతో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాల కోసం వుడా రూ.50లక్షలు ఖర్చు చేస్తోంది. కాగా ప్రధాన వేదికపై కార్యక్రమాల కోసం మాత్రమే ఈ ఫ్యాక్టర్‌ సంస్థకు ఏకంగా రూ.3.5కోట్లు కాంట్రాక్టు అప్పగించారు. కానీ జిల్లాకు ఈ ఉత్సవాల పేరిట ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.

మంత్రి గంటా, అనుచరులదే పెత్తనం
ఈ సారి కూడా విశాఖ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్, శానిటేషన్, పెయింటింగ్స్‌ కోసం జీవీఎంసీ ఖజానా ఖాళీ అయిపోతుంది. ఉత్సవాల పేరు చెప్పి గడిచిన 20 రోజులుగా ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, గోడలకు ప్రత్యేకంగా రంగులు వేస్తున్నారు. ముంబయి, పుణే, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు చెందిన కళాకారులకు ఇస్తున్న ప్రాధాన్యత స్థానిక జిల్లా కళాకారులకు ఇవ్వడం లేదు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ తీసుకొచ్చే కళాకారులకు లక్షలాది రూపాయలు పారితోషికాలు చెల్లిస్తుంటే... స్థానిక కళాకారులకు ముట్టేది మాత్రం వేలు..వందల్లోనే. దీంతో స్థానిక కళాకారులు విశాఖ ఉత్సవాల్లో తమకు కనీస ప్రాధాన్యమివ్వడం లేదంటూ మండిపడుతున్నారు. స్టాల్స్‌ కేటాయింపు గంటా అనుచర గణమే దగ్గరుండి చేస్తోంది. మరోవైపు ఉత్సవాలు దండగమారిన ఖర్చంటూ తరచూ వ్యాఖ్యానించే సీనియర్‌ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడుతో సహా ఆయన వర్గీయులు సైతం ఈసారి విశాఖ ఉత్సవాలకు దూరంగా ఉంటున్నారు. సమీక్షల్లో కాదు కదా.. కనీసం ఏర్పాట్లలో ఏ ఒక్కరోజు పాల్గొన్న దాఖలాలు లేవు. ఉత్సవాలను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తుండడంతో మంత్రి అయ్యన్న ఉత్సవాలకు వస్తారా? రారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. మొత్తం మీద జనం సొమ్ముతో మరోసారి జాతర చేసేందుకు అధికార యంత్రాంగం భారీగానే ఏర్పాట్లు చేసింది.

ఏడాది గడిచినా అందని బహుమతులు
మరోవైపు బహుమతులు, ఇతర ఏర్పాట్ల పేరిట జిల్లా యంత్రాంగం, అధికార పార్టీ నేతలు వసూళ్లు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం నగరంలోని వ్యాపారవేత్తలు, ముఖ్యమైన సంస్థల నుంచి రూ.50లక్షల వరకూ వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. రానున్న మూడు రోజులు మరో రూ.50 లక్షల వరకు ఆయా సంస్థలపై భారం పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా సొమ్మొకడిది సోకొకడది అన్నట్టుగా విశాఖ ఉత్సవాలను హంగూ ఆర్బాటాలతో ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది జరిగిన విశాఖ ఉత్సవ్‌లో లక్కీ డిప్‌ల పేరిట హంగామా చేశారు. విజేతలకు కారు, మోటార్‌ బైకులు, బంగారు ఆభరణాలు అంటూ హడావుడి చేశారు. చివరి రోజు ముఖ్య అతిథుల పేరిట లక్కీ డిప్‌లు కూడా తీశారు. కానీ ఏడాది కావస్తున్నా నేటికీ ఏ ఒక్కరికీ ఒక్క బహుమతి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరలా ఈ ఏడాది కూడా విశాఖ ఉత్సవాల పేరు చెప్పి బహుమతుల కోసం దండేస్తున్నారు. మారుతి షిప్ట్, 50 గ్రాముల బంగారం, బైకులతో పాటు పెద్ద సంఖ్యలో లక్షలాది రూపాయల విలువైన బహుమతులు ప్రదానం చేస్తామని ప్రచారం చేస్తున్నారు. ఆ వంకతో భారీగానే నగరంలో వసూళ్లకు పాల్పడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top