కరోనాతో 50 లక్షల మంది వరకూ చనిపోవచ్చు

Chandrababu Comments On Covid-19 - Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబు  

సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి 

అసెంబ్లీ సమావేశాలపై నిపుణులతో చర్చించాలి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వల్ల మన దేశంలో 20 నుంచి 50 లక్షల మంది వరకూ చనిపోయే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ (సీడీడీఈపీ) అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ఈ మేరకు అంచనా వేసిందని తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. 

- జనసాంద్రత ఎక్కువ ఉండే ఇండియా లాంటి దేశంలో 20 కోట్ల నుంచి 30 కోట్ల మందికి ఈ వ్యాధి విస్తరించే ప్రమాదం ఉందని వారి అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రభుత్వాలు కూడా బాధ్యతగా తీసుకోవాలి.  
- డిజిటల్‌ సోషలైజేషన్‌ ద్వారా సమాచార మార్పిడి చేసుకోవాలి. ఈ విధానంలోనే ఉద్యోగులు విధులను నిర్వర్తించాలి. 
- విదేశాల నుంచి వచ్చిన వారందరనీ ముందే క్వారంటైన్‌ చేసి ఉండాల్సింది. ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తే చాలదు. దీనికోసం ప్రత్యేకంగా ఆస్పత్రులు నెలకొల్పాల్సివుంది. 
- ప్రధాని  ప్రకటించిన లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా ఆచరించాలి.  
- కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండేలా చూడాలి. నిత్యావసరాలు ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయాలి.  
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కోల్పోయిన కూలీలకు ప్యాకేజి ప్రకటించాలి.  
- రాబోయే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఆలోచించాలి. 
- కాగా నివారణ, బాధితుల సహాయానికి వినియోగించేందుకు తమ నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి విరాళంగా ఇవ్వాలని టీడీపీ శాసనసభాపక్షం తరఫున విపక్షనేత చంద్రబాబు నిర్ణయించారు.  వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ.10 లక్షల విరాళం ఇస్తానని ఆయన తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top