4 నిమిషాలకో నిండు ప్రాణం బలి! | Central medical health report disclosed about Road Accidents | Sakshi
Sakshi News home page

4 నిమిషాలకో నిండు ప్రాణం బలి!

Nov 17 2019 5:42 AM | Updated on Nov 17 2019 5:42 AM

Central medical health report disclosed about Road Accidents - Sakshi

సాక్షి, అమరావతి: రహదారులపై మృత్యు ఘంటికలు మోగుతున్నాయి! రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా ఐదుగురు తీవ్రంగా గాయపడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. క్షతగాత్రుల్లో 30 శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 30 వేల నుంచి 40 వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా వైకల్యం బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది వైకల్య బాధితుల జాబితాలో చేరుతున్నట్టు నివేదిక వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు గురైన వారికి సత్వరమే చికిత్స అందించి వైకల్యం బారిన పడకుండా కాపాడాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా లేఖ రాసింది.  

3వ స్థానంలో ఉమ్మడి ఏపీ 
కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఏపీ 3వ స్థానంలో (2011 లెక్కల ప్రకారం) ఉంది. ఒక్క ఏడాదిలో 30 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 8,200 మందికి పైగా మృతి చెందారు. ఇది దేశవ్యాప్తంగా ప్రమాదాల సగటులో 7.52 శాతం. ఏపీలో బోధనాసుపత్రులకు ఏటా సగటున 14 వేల మంది ప్రమాద బాధితులు చికిత్స కోసం  వస్తున్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క ఏడాదిలో 24,914 మంది ప్రమాద బాధితులు వచ్చినట్టు నమోదైంది.  

100 ట్రామాకేర్‌ సెంటర్లు
 రోడ్డు ప్రమాదాల్లో మరణాల, వైకల్యాల తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రంలో ట్రామా కేంద్రాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 13 ట్రామా కేంద్రాలు పని చేస్తున్నాయి. త్వరలోనే ఎయిమ్స్‌ సహకారంతో విజయవాడ వైద్య కళాశాలలో అపెక్స్‌ ట్రామాకేర్‌ కేంద్రం ఏర్పాటు కానుంది. 100 ట్రామా సెంటర్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. 
–డాక్టర్‌ బి.వెంకటేశ్వరరావు, నోడల్‌ అధికారి, ట్రామాకేర్‌ విభాగం

నివేదికలో మరికొన్ని అంశాలివీ..
- ప్రతి పదేళ్లకు 50 లక్షల మంది అంటే ఏటా 5 లక్షల మంది రకరకాల ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారు.  
బాధితుల్లో 10 – 19 ఏళ్ల లోపువారే ఎక్కువగా 46.16 లక్షలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  
20–29 ఏళ్ల లోపు వారు 41.89 లక్షల మంది, 30–39 ఏళ్ల లోపు వారు 36.35 లక్షల మంది, 40–49 ఏళ్ల లోపు వారు 31.15 లక్షల మంది వైకల్య బాధితుల జాబితాలో ఉన్నారు. 
ప్రమాదం జరిగిన తొలి గంట లోపే వైద్యచికిత్స అందిస్తే వైకల్యం బారి నుంచి కాపాడవచ్చు. ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రమాదల తీవ్రతను తగ్గించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement