తమ్ముళ్లకు ఝలక్ | Brothers Jhalak | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు ఝలక్

Dec 25 2014 2:00 AM | Updated on Mar 22 2019 6:18 PM

జిల్లాలోని ప్రముఖ ఆలయాల కమిటీల నియామకానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై తెలుగుతమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ప్రముఖ ఆలయాల కమిటీల నియామకానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై తెలుగుతమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు పదవుల పందేరం చేస్తామంటూ రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ నేతలు ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది.
 
  నియామకాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా నేతలు బూటకపు మాటలు చెబుతున్నారని తమ్ముళ్లు వాపోతున్నారు. జిల్లాలో వెంగమాంబ ఆలయం (నర్రవాడ), కామాక్షమ్మ ఆలయం (జొన్నవాడ), చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం (సూళ్లూరుపేట), ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం (తూర్పుకనుకూరు), రాజరాజేశ్వరి దేవస్థానం (నెల్లూరు), తల్పగిరి రంగనాథ దేవాలయం (నెల్లూరు), శ్రీపెనుశిల నరసింహస్వామి దేవస్థానం (పెంచలకోన) ఆలయాలకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో ఐదు ప్రధాన ఆలయాలకు కొత్తగా ట్రస్టుబోర్డుల నియామకానికి కోర్టు వివాదాలు అడ్డొస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించకుండా ఏకంగా కమిటీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో తమ్ముళ్లు సంబరపడ్డారు. అయితే కోర్టు వివాదాల తేలేవరకు కమిటీల నియామకం జరిగే అవకాశం లేదని తెలుసుకున్న టీడీపీ నాయకులు అధిష్టానంపై మండిపడుతున్నారు. పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఆగ్రహంతో ఉన్నారని తెలుసుకున్న జిల్లా ముఖ్యనేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. దేవాదాయమంత్రి మాణిక్యాలరావును కలిసి గడువు పొడిగించమని కోరినట్లు సమాచారం.
 
  ఒక్క నెల్లూరు జిల్లాను దృష్టిలో ఉంచుకుని గడువు పొడిగించటం వీలుకాదని మంత్రి తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆలయ కమిటీల నియామకం కోసం దరఖాస్తు సమయం నవంబర్ 10తో ముగియటంతో ఆశాఖ అధికారులు అప్పటివరకు వచ్చిన ఆశావాహుల జాబితాను ప్రభుత్వానికి పంపారు. అయితే రాజరాజేశ్వరి, రంగనాథ ఆలయాలకు మాత్రమే కమిటీల నియామకానికి అడ్డంకులు లేవని తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement