కేజ్రీవాల్‌దే లేటు! | Real Reason Behind Raghav Chadha, Others Left AAP | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌దే లేటు!

Apr 25 2026 9:15 AM | Updated on Apr 25 2026 9:46 AM

Real Reason Behind Raghav Chadha, Others Left AAP

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పుట్టుకే ఒక ఉద్యమం. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి పుట్టిన ఈ పార్టీ, ఢిల్లీ గడ్డపై వరుస ఘనవిజయాలతో ప్రజాస్వామ్యానికి కొత్త ఆశ చూపింది. కానీ 14 ఏళ్ల తర్వాత.. అవినీతి, అంతర్గత విభేదాలతో ఘోరంగా దెబ్బ తింటోంది. ‘‘సరైన మార్గంలో కొనసాగి ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు’’ అని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేర్కొనడమే ఇందుకు నిదర్శనం.

ఢిల్లీ ఓటమి తర్వాత.. రాజ్యసభ ఎంపీలు గుడ్‌బై చెప్పడం ఆప్‌కు తగిలిన మరో భారీ షాక్‌. రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన 10 మందిలో.. ఒకేసారి ఏడుగురు బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.  ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన రాఘవ్‌ చద్దా ఆధ్వర్యంలోనే ‘ఆపరేషన్‌ లోటస్‌’ జరగడం మరో ట్విస్ట్‌. ఆప్‌లో ఇబ్బందులు ఎదురైనందు వల్లే వారీ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్నగా అసంతృప్తి మొదలై..  పార్టీ విలువలు దూరమవుతున్నాయనే భావన.. నాయకత్వంపై నమ్మకం తగ్గిపోవడం.. పార్టీలో కీలక స్థానం నుంచి తనను తొలగించడం.. చివరకు ఆయన్ని, ఇతర ఎంపీలతో కలిసి పార్టీని వీడేలా చేశాయన్నది చద్దా స్టేట్‌మెంట్‌తో స్పష్టమవుతోంది. అయితే..

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత  కేజ్రీవాల్‌ ప్రధానంగా పార్టీని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. వరుసగా వలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే పంజాబ్‌పై ఆయన ఫోకస్‌ పెట్టారు. అయితే ఈ అసంతృప్త జ్వాలలను కేజ్రీవాల్‌ ముందే పసిగట్టినట్లు తెలుస్తోంది. 

వాళ్లను శాంతింపజేయాలని ఆయన ప్రయత్నాలు కూడా చేశారట!. ఈ క్రమంలో వాళ్ల కోసం మరో ఆఫర్‌ కూడా చేసినట్లు పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ‘‘మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఇప్పుడే రాజీనామా చేయండి. వచ్చే టర్మ్‌లో మళ్లీ టికెట్లు ఇస్తాం..’’ అని కేజ్రీవాల్‌ వాళ్లకు చెప్పాలనుకున్నారు. ఇందుకోసం వాళ్లతో ఓ సమావేశం నిర్వహించాలని కూడా భావించారు. అయితే..

ఈలోపే ఆలస్యం అయ్యింది. ఎంపీలు ముందే నిర్ణయం తీసేసుకుని రాజీనామాలు చేసేసి బీజేపీలో చేరాలని డిసైడ్‌ అయ్యారు. కేజ్రీవాల్‌ చివరి నిమిషం దాకా వేచి ఉండకుండా.. తొందరపడి ఉంటే ఇది‌ జరిగి ఉండేది కాదని, కొంతలో కొంతైనా డ్యామేజ్‌ కంట్రోల్‌ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఆప్‌లో ఉన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ను, అధిష్టానం-నాయకుల మధ్య దూరాన్ని ఈ ఎపిసోడ్‌ బయట పెట్టింది.

ఆప్‌ను వీడింది 
రాఘవ్‌ చద్దా, సందీప్‌ పాఠక్, అశోక్‌ మిట్టల్‌, స్వాతి మలివాల్‌, హర్భజన్‌ సింగ్, రాజిందర్‌ గుప్తా, విక్రమ్‌ సాహ్నీ

ఆప్‌లో మిగిలింది
సంజయ్‌సింగ్, ఎన్‌.డి.గుప్తా, బల్బీర్‌ సింగ్‌ సీచెవాల్‌

సభ్యత్వం ఉంటుందా?
ఆప్‌ను వీడిన ఎంపీలు 2/3 వంతుకు పైగా(10లో ఏడుగురు) ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం.. వాళ్ల రాజ్యసభ సభ్యత్వాలకు ఎలాంటి ఢోకా లేదు.

Advertisement
 
Advertisement
Advertisement