తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల్లో భారీ విజయంతో టీవీకే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని టీవీకే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో టీవీకే గేమ్ ప్లాన్ ఏంటంటే..
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తమిళనాడుకు బయట కూడా పార్టీ విస్తరణపై విజయ్ ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై టీవీకే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బరిలోకి దిగాలనే టీవీకే ప్లాన్ చేస్తోంది. బెంగళూరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కొత్త రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు సిద్దమైనట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 50 వార్డుల్లో పోటీ చేసి తన బలం పరీక్షించుకోవాలని యోచిస్తోంది. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విజయ్ స్వయంగా బెంగళూరులో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది పార్టీకి పెద్ద మద్దతు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక స్థాయిలో విజయాలు సాధిస్తే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీవీకే అడుగుపెట్టే అవకాశం ఉంది.
TVK might contest Bengaluru Local Polls in Karnataka as per Asianet. pic.twitter.com/RSYX5fSRYw
— News Algebra (@NewsAlgebraIND) May 23, 2026
కర్ణాటకలో టీవీకేకు అవకాశాలు..
1. బలం
తమిళ ఓటర్ల ఆధారం: బెంగళూరులో సుమారు 15–20 లక్షల తమిళ మాట్లాడే ప్రజలు ఉన్నారని అంచనా. వీరిని లక్ష్యంగా చేసుకోవడం టీవీకే ప్రధాన వ్యూహం.
విజయ్ అభిమాన సంఘాలు: బెంగళూరులో విజయ్‌కు పెద్ద అభిమాన వర్గం ఉంది. అభిమాన సంఘాలు ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. వీరిని అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా టీవీకేకు బలమైన గ్రాస్‌రూట్ నెట్‌వర్క్ లభిస్తుంది.
2. సవాళ్లు
స్థానిక సమస్యలు: బెంగళూరులో నీటి సమస్య, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక అంశాలపై స్పష్టమైన అజెండా లేకపోతే టీవీకేకు పెద్ద పార్టీలతో పోటీ కష్టమవుతుంది.
ప్రతిష్టాత్మక పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే బలమైన స్థావరాన్ని కలిగి ఉన్నాయి. టీవీకేకు మొదటి దశలో వార్డుల స్థాయిలో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రాంతీయ గుర్తింపు: టీవీకే తమిళనాడు ఆధారిత పార్టీ కావడంతో, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం లేదు.
టీవీకే బలం..
ప్రాంతాలు: శివాజి నగర్, హలసూరు, వివేక్ నగర్, ఈజిపుర, మడివాల, శాంతినగర్ వంటి వార్డుల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువ.
ఓటు బ్యాంక్: ఈ ఓటర్లు సాధారణంగా కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మొగ్గు చూపుతారు. టీవీకే ప్రవేశం వల్ల ఈ ఓటు బ్యాంక్ విభజించే అవకాశం ఉంది.
ప్రాంతీయ విస్తరణ: తమిళనాడు, పుదుచ్చేరి తర్వాత, కర్ణాటకలో కూడా తన ప్రభావాన్ని విస్తరించడం.
అయితే, ఇప్పటివరకు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎంట్రీపై టీవీకే అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ కర్ణాటకలో టీవీకే.. తమిళ ఓటర్ల ఆధారం మరియు విజయ్ ప్రజాదరణను బలంగా ఉపయోగించుకుంటే, స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ, స్థానిక సమస్యలపై స్పష్టమైన అజెండా లేకపోతే, పెద్ద పార్టీలతో పోటీ చేయడం కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకే పోటీ చేస్తుందా? ఒకవేళ బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


