రేవంత్‌కు డబుల్ ట్రబుల్? | KSR Analysis And Review On Telangana CM Revanth Reddy’s Policy Decisions And Metro Controversy, Watch Video Inside | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు డబుల్ ట్రబుల్?

Jun 19 2026 11:22 AM | Updated on Jun 19 2026 12:04 PM

KSR's Comments On Telangana CM Revanth Reddy's Decisions

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.

మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్‌కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్‌సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్‌ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.

రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్‌వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.

బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.

ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్‌బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్‌లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్‌గా ఉంది.

ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.

ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.

ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి  ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. 

అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్‌లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్‌లో పడితే అది కాంగ్రెస్‌తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement