నిర్లక్ష్యం మింగేసింది

Boy Killed After Fell Down Into Water Tank - Sakshi

సూయెజ్‌ ట్యాంక్‌లో పడి బాలుడి దుర్మరణం 

రక్షణ వలయం లేకపోవడం వల్లే ప్రమాదం  

జ్ఞానాపురం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్‌ కాలనీలో విషాదం 

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ) : జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి నిండు జీవితాన్ని మింగేసింది. సూయెజ్‌  ట్యాంక్‌ రెండేళ్లుగా పనిచేయకున్నా కనీస రక్షణ వలయం ఏర్పాటు చేయకపోవడంతో అందులో పడి ఏడేళ్లు బాలుడు దుర్మరణం పాలయ్యా డు. హృదయాలను కలిచివేసే ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానాపురం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్‌ కాలనీకి వెనుక భాగంలో ఉన్న సూయెజ్‌  ట్యాంకు రెండేళ్లుగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి దీని నిర్వహణను జీవీఎంసీ అధికారులు గాలికొదిలేశారు. ఈ ట్యాంకు భూ మట్టానికి కేవలం నాలుగు అడుగుల ఎత్తులోనే ఉన్నప్పటికీ అవసరమైన రక్షణ వలయం ఏర్పాటు చేయడంగానీ, ఇతరులు అక్కడికి వెళ్లకుండా కంచెగానీ ఏర్పాటు చేయలేదు.

ఈ నేపథ్యంలో ఇదే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్‌ కాలనీలో నివాసముంటున్న కొండలరావు, రాజేశ్వరికి నవీన్‌(7)తోపాటు ఐదేళ్ల మరో కుమారుడు ఉన్నాడు. వీరిలో నవీన్‌ బుధవారం సాయంత్రం కాలనీ సమీపంలో ఆడకుంటూ సూయెజ్‌  ట్యాంక్‌ వద్దకు చేరి ప్రమాదవశాత్తూ అందులోకి జారిపోయాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఫైర్‌ సిబ్బంది కూడా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రెస్క్యూ టీమ్‌కు సమాచారమిచ్చారు. వారు ట్యాంక్‌లో గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం కంచరపాలెం పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సూయెజ్‌  ట్యాంక్‌ వద్ద కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం సంభవించి బాలుడు మృతి చెందాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. ఈ ఘటనతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్‌ కాలనీలో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top