
సంఘటనా స్థలంలో పడిఉన్న బైక్‌లు
విజయనగరం టౌన్: మండలంలోని జమ్ము నారాయణపురం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురు గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రూరల్ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం రావాడ గ్రామానికి చెందిన ఎ. అప్పలనరసయ్య ఆయన భార్య రాధ, పిల్లలు సుజయ్‌రామ్, రాహుల్ విజయనగరంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి డెంకాడ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
అదే మార్గంలో తాడివాడ నుంచి విజయనగరం వైపు టీవీఎస్ ఎక్స్‌ల్ పై రెడ్డి పైడిబాబు, మజ్జి శ్రీను వస్తున్నారు. జమ్ము నారాయణపురం జంక్షన్ మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించకపోవడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికీ గాయాలు కాగా అప్పలనరసయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం అప్పలనరసయ్యను విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.