
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని గరుడ వారధి ఫ్లైఓవర్‌పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న చక్రధర్, వేదాంత్ ఇద్దరూ బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, విద్యార్థి చక్రధర్(19) అక్కడికక్కడే మృతి చెందగా.. వేదాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న తిరుమల ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరినీ రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.