నేను మీ శిరోధైర్యాన్ని..!
●
తిరుపతి మంగళం : నాకే బాధేస్తోంది.. ఇలా నా గురించి, నా అవసరం గురించి మీతో చెప్పక తప్పడం లేదు. జిల్లాలో నన్ను విస్మరిస్తున్న తీరుపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మార్పు రాకపోవడంతో తట్టుకోలేక మీ ముందుకు వచ్చి నా గోడు వినిపిస్తున్నా. ఇంతకూ నేనెవరనేగా మీ అనుమానం. మీ ప్రయాణంలో మీ తలకు రక్షణగా ఉండే హెల్మెట్‌ను. రహదారి ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయిన వారి కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇదంతా ఎందుకంటే ఇటీవల నన్ను ధరించని వారు జిల్లాలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికై నా మీరు మారండి.. నా మాట వినండి. నన్ను తలకెక్కించుకోండి.
తలకు పెట్టుకుంటే ప్రాణం దక్కించుకున్నట్లే..
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నన్ను తప్పనిసరిగా ధరించాలి. ఊడి కింద పడకుండా బెల్టు పెట్టుకోవాలి. ఐఎస్‌ఐ మార్కును పరిశీలించి వినియోగించండి. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే తలకు దెబ్బ తగలకుండా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. శరీరం మొత్తంలో తలే కీలకం. దానికి దెబ్బ తగలకుండా నేను కాపాడుతా. నన్ను ధరిస్తే జుట్టు ఊడిపోతుందనేది కేవలం అపోహనే. ఈ విషయం ఇప్పటికే వైద్యపరంగా రుజువైంది. హెల్మెట్ ధరించకుండా వెళితే పెట్రోల్ కూడా పట్టవద్దని పెట్రోల్ బంకుల యజమానులకు కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాహనచోదకుల్లారా తలకు హెల్మెట్ లేకుండా ప్రయాణించగలరేమో.. కానీ బైక్‌లో పెట్రోల్ లేకుండా ప్రయాణించలేరు కదా.


