వైఎస్సార్‌ సీపీ నేత ఇల్లు కూల్చివేతకు విఫలయత్నం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేత ఇల్లు కూల్చివేతకు విఫలయత్నం

Mar 3 2026 7:19 AM | Updated on Mar 3 2026 7:19 AM

● రాజకీయ కక్షతో హైకోర్టు ఉత్తర్వులని రెవెన్యూ సిబ్బంది హంగామా ● బీసీ సంఘాలు మూకుమ్మడిగా ఎదుర్కోవడంతో తిరుగుముఖం

ఏర్పేడు: మండలంలోని చింతలపాళెంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్యయాదవ్‌ ఇంటిని కూల్చేందుకు సోమవారం రెవెన్యూ సిబ్బంది విఫలయత్నం చేశారు. అయితే గ్రామస్తులు, బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు అడ్డుకోవడంతో అక్కడ నుంచి వెనుతిరిగారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చింతలపాళెంలో సర్వే నంబర్‌ 21లోని 3సీలో 85సెంట్లు డీకేటీ భూమిని 25ఏళ్ల కిందట కూనాటి రమణయ్యయాదవ్‌ కొనుగోలు చేసి, అందులోని 8 సెంట్ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు రెండు రోజుల కిందట వచ్చాయని, దీంతో ఇంటిని కూల్చేందుకు తహసీల్దార్‌ భార్గవి ఆదేశాలతో ఆర్‌ఐ సుబ్రమణ్యం, 10 మంది వీఆర్వోలు, సర్వేయర్లు సోమవారం జేసీబీ తీసుకుని అక్కడకు చేరుకున్నారు. అయితే స్థానికులు ఆక్షేపించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న యాదవసంఘం రాష్ట్ర నాయకుడు అన్నా రామచంద్రయాదవ్‌, పలువురు యాదవ సంఘ నాయకులు, బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని రాజకీయ కక్షతో చేస్తున్న దుశ్చర్యను ఆపాలని డిమాండ్‌ చేశారు. దీంతో చేసేది లేక రెవెన్యూ సిబ్బంది అక్కడ నుంచి తిరుగుముఖం పట్టారు. దీనిపై తహసీల్దార్‌ భార్గవిని వివరణ కోరగా.. మండలంలోని చింతలపాళెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 21 సబ్‌ డివిజన్‌ 3సీలో 85 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని రెండు రోజుల కిందట తమకు హైకోర్టు ఉత్తర్వులు అందాయన్నారు. సోమవారం అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించామని, ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో పోలీసు బలగాలను సాయం తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement