అక్రమం ఇష్టారాజ్యంగా మారింది.. మట్టి తరలింపు పచ్చనేతలకు వరమైంది.. మట్టికి డిమాండ్ ఏర్పడడంతో అక్రమార్కులు రాత్రి వేళలో యథేచ్ఛగా మట్టి తరలించి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందంతా తెలిసినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు చీమకుట్టినట్టైనా లేకుండా పోయింది. ఫలితంగా చెరువు చెరబడుతోంది.
చంద్రగిరి:చంద్రబాబు సర్కారులో మట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. పది రోజులుగా నిత్యం చెరువులో మట్టిని తోడేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. రెవెన్యూ శాఖలోని ఓ అధికారి అండదండలతోనే ఇలా మట్టిని దోచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఏ.రంగంపేట పంచాయతీ నాగపట్ల చెరువులో పది రోజులుగా మట్టి మాఫియా చెలరేగిపోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిత్యం జేసీబీలతో మట్టిని తవ్వి, వందలాది ట్రాక్టర్లకు నింపి, తరలిస్తున్నారు.
టీడీపీ నేత ప్రజాప్రతినిధి సన్నిహితుడి
సహకారంతో..
నాగపట్ల చెరువు నుంచి స్థానికంగా ఉండే ప్లాట్లు, వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని డిమాండ్ ఆధారంగా రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతతోపాటు ఓ ప్రజాప్రతినిధికి పీఏ అంటూ చెప్పుకునే మరో వ్యక్తి ఈ మట్టి మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యక్తి ప్రజాప్రతినిధి పేరుతో దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమి అక్రమణలతో పాటు ఇలా అక్రమ మట్టి మాఫియా నుంచి మామూళ్లు తీసుకుంటూ సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వాల్టాకు రెవెన్యూ తూట్లు
నాగపట్ల చెరువులో మట్టి మాఫియాపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తోన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతతోపాటు ప్రజాప్రతినిధి అనధికార పీఏతో చేతులు కలిపి మట్టి మాఫియాకు సహకరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. రెవెన్యూశాఖలోని ఓ అధికారికి మాఫియా నుంచి ముడుపులు అందుతున్నట్లు సమాచారం. చంద్రగిరి మండలంలో విచ్చలవిడిగా జరుగుతున్న మట్టి, ఇసుక మాఫియాలపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


