రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

Mar 3 2026 7:19 AM | Updated on Mar 3 2026 7:19 AM

నాయుడుపేట టౌన్‌: మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీయ రహదారి కూడలి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం కలగుర్తిపాడు గ్రామానికి చెందిన తీపలపూడి దొరస్వామి(66) సోమవారం బిరదవాడ జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరస్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా దినోత్సవాన్ని

ఘనంగా జరుపుకుందాం

తిరుపతి అర్బన్‌: జిల్లాలో ఈ నెల 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలని అధికారులకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్‌ కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, ఐసీడీఎస్‌ పీడీ వసంతబాయి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి రాజా వినోద్‌, డీఆర్‌డీఏ అడిషన్‌ పీడీ ప్రభావతి పాల్గొన్నారు.

పీ4 జాబ్‌ మేళా 5న

తిరుపతి తుడా: పీ4 కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీన జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌ మౌర్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా జీవకోనలోని విశ్వం స్కూల్‌లో గురువారం నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో హైస్కూల్‌ టీచర్‌, ప్రీప్రైమరీ టీచర్‌, వార్డన్లు, పీఆర్వో, ఫ్రంట్‌ ఆఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌, పలు టెక్నికల్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్‌ నుంచి పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. జాబ్‌మేళాకు బంగారు కుటుంబాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలని సూచించారు.

11 నుంచి దివ్యాంగులకు పరీక్షలు..పరికరాల పంపిణీ

తిరుపతి అర్బన్‌: దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి, పరికరాలు అందించడానికి ఏఎల్‌ఐఎంసీఓ కాన్పూర్‌ సంస్థ వారు ముందుకు వచ్చారు. ఆ మేరకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు మండలాల వారీగా జిల్లా వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పరీక్షలు నిర్వహించి దారిద్య్రరేఖ పరిమితికి లోబడి ఉన్న వారికి చేతి కర్రలు, వాకర్లు, మూడు కాళ్ల చేతి కర్రలు, నాలుగు కాళ్ల చేతి కర్రలు, చంక కర్రలు, వీల్‌ చైర్లు, వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రైసైకిల్‌, మూడు చక్రాలు సైకిల్‌, రోలేటర్స్‌ తదితర పరికరాలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజా వినోద్‌, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, ఐసీడీఎస్‌ పీడీ వసంతబాయి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

లా కోర్సుల పరీక్ష ఫీజు చెల్లింపునకు 13 చివరి తేది

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో మూడు, ఐదేళ్ల లా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు పలు సెమిస్టర్‌ పరీక్షల కోసం ఈనెల 13వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారాన్ని ఇప్పటికే అన్ని లా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపామన్నారు. అలాగే ఈ నెల 25 నుంచి పలు లా కోర్సుల విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయని షెడ్యూల్‌ విడుదల చేశామని వెల్లడించారు.

సీఆర్‌ఎస్‌ వర్క్‌ షాప్‌ను

సందర్శించిన రైల్వే జీఎం

రేణిగుంట: సీఆర్‌ఎస్‌లో సోమవారం జరిగిన వర్క్‌షాపునకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవత్సవ పాల్గొన్నారు. ఆయనకు ముందుగా సీఆర్‌ఎస్‌ చీఫ్‌ వర్క్‌ షాప్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆయన సీఆర్‌ఎస్‌లోని అన్ని షాపులను తిరిగి కార్మికుల పనితీరును పరిశీలించి, కోచ్‌లను అత్యుత్తమ నాణ్యతతో చేస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సీడబ్ల్యూఎం శ్రీనివాస్‌ కార్మికులు పనితీరును నాణ్యతతో చేస్తున్నారని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్‌కు విచ్చేసిన జీఎంసీఆర్‌ఎస్‌ మజ్దూర్‌ యూనియన్‌ కార్యవర్గం జీఎంకు శాలువ కప్పి సత్కరించి, సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీఆర్‌ఎస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇన్సెంటివ్‌ అన్ని షాపులకు 50 శాతం తగ్గకుండా ఇవ్వాలని కోరారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌, రైలు కళ్యాణ్‌ కొత్త భవనాలు నిర్మించాలని, శిథిలమైన రైల్వే క్వార్టర్స్‌ తొలగించి కొత్తవి నిర్మించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement