చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రజలు , స్క్రబ్ టైఫస్ సోకిన వ్యక్తికి ఏర్పడిన పుండు
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికి 289 నమూనాలను సేకరించగా 39 మందికి పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. రెండు రోజుల కిందట సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థి, కేవీ పల్లె మండల పరిధిలో మరో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కావడంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం.
స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
అధికశాతం మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. అధికారులు దీనిపై విస్తృతంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మండల పరిధిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. .
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ.....
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదనుగా భారీగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా సమయంలో ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. సాధారణ జ్వరాన్ని స్క్రబ్ టైఫస్ అని భయాందోళనకు గురిచేస్తూ పేదల నుంచి డబ్బు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన ల్యాబ్, మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
లక్షణాలు ఇవి..
స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఇది చిగ్గర్స్ అనే చిన్న కీటకాల లాంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. ఈ చిగ్గర్స్ కీటకాలు పొదలు, గడ్డి, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. ఇవి కుట్టినప్పుడు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన తర్వాత 5–15 రోజుల్లోపు తీవ్రమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, బలహీనత, మెడ, చంకల్లో వాపు గడ్డలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి.
అలాగే పురుగు కుట్టిన చోట ముదురు రంగుతో కూడిన పుండు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలుంటే స్క్రబ్ టైఫస్‌గా భావించాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించకపోతే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో పాటు అవయవాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని, సకాలంలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు.
నివారణ మార్గాలు ఏంటంటే..
స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే చేతులు, కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి, పొదలు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
8 శరీరంలోకి నేరుగా ప్రవేశించదు
స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రభావం జిల్లాలో చాలా తక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 39 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. స్క్రబ్ టైఫస్ బ్యాక్టిరియా శరీరంలోకి నేరుగా ప్రవేశించలేదు. బ్యాక్టిరియాను మోసుకెళ్లే ఈగలు, పేలు, నల్లులు కుట్టడం ద్వారా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టినచోట కొందరికి నల్లని మచ్చ ఏర్పడుతోంది.
కొందరిలో మచ్చ కనిపించదు. నొప్పి ఉండదు. ఇవి కుట్టినచోట బ్యాక్టిరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజులకు పూర్తి లక్షణాలు బయటపడతాయి. మొదట్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి వంటి లక్షమాలు కనిపిస్తాయి. మలేరియా, టైపాయిడ్ అనే భ్రమలో ఉన్నవారు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోవాలి.
– లక్ష్మీ నరసయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి


