వికటించిన భోజనం
తొండూరు : పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. జగనన్న ప్రభుత్వంలో నాణ్యమైన విద్యతోపాటు నాడు– నేడు కింద పాఠశాలలను పునర్నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే చంద్రబాబు పాలనలో విద్యార్థులకు కనీసం కడుపు నింపేందుకు నాణ్యమైన భోజనం కూడా అందించకపోవడం సిగ్గుచేటు. వైఎస్‌ఆర్ జిల్లా తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలోని యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి యథావిధిగా శనివారం భోజనం అందించాల్సి ఉంది. మెనూ ప్రకారం అన్నం, పప్పు, రసం అందించాల్సి ఉంది. అయితే అన్నం, వంకాయ, సాంబారు, స్వీట్ పొంగలి అందించారు. వీటిని తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి విరేచనాలు, వాంతులు అయ్యాయి. వారు పాఠశాలలో చదువుతుండగా ఒకేసారి వాంతులు, విరేచనాలు రావడంతో ఉపాధ్యాయురాలు భారతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా శాఖ ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు. వారు 108 వాహనానికి ఫోన్ చేసి బాధితులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ కావడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. 24 గంటలు తమ పర్యవేక్షణలో ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. తోటలోని వంకాయలు తెచ్చి కడగకుండా వండారని, వాటికి పురుగు నివారణ మందు అవశేషాలు అలాగే ఉండటంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, రసూల్, జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి వెళ్లిరు. విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ షంషుద్ధీన్, ఆర్డీఓ చిన్నయ్య ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
10 మంది విద్యార్థులకు అస్వస్థత
పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలింపు
అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం
మెనూ ప్రకారం వడ్డించకపోవడమే కారణమని మండిపాటు
పరామర్శించిన డీఈఓ, ఆర్డీఓ
వికటించిన భోజనం


