హాస్టల్ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
కేవీపల్లె : హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్, ఎంపవర్‌మెంట్ అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. గ్యారంపల్లె ఎస్సీ హాస్టల్‌లో ఉన్న సంబేపల్లె మండలానికి చెందిన విద్యార్థి శశిధర్ నాయక్ తమ గ్రామానికి వెళ్లి స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన నేపథ్యంలో శనివారం ఎస్సీ హాస్టల్‌ను జిల్లా అధికారులు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్‌లో ఉంటున్న పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీవీఎంఈ వెంకటరమణ, అసిస్టెంట్ సోషియల్ వెల్ఫేర్ అధికారి కృష్ణ, హాస్టల్ వార్డెన్ బి. లత పాల్గొన్నారు.
నేడు ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం సమావేశం
కడప ఎడ్యుకేషన్ : ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి బోస్‌నగర్‌లోని విజ్ఞానం స్కూల్‌లో ఆదివారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీవీ సుబ్బారెడ్డి, జి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, గౌరవాధ్యక్షులు పీసీ రెడ్డన్న, ఆర్థిక కార్యదర్శి ఎస్.ఇలియాస్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చేయాల్సిన పోరాటాలపై చర్చించనున్నట్లు వివరించారు. సమావేశానికి ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని కోరారు.


