కమనీయం..శ్రీవారి కల్యాణం
రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణంలోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో శ్రీవారి భక్తసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పూలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై కల్యాణ ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు.తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన వేదపండితులు స్వామివారి కల్యాణ క్రతువును జరిపించారు. మంగళసూత్రాన్ని పురోహితులు భక్తులకు చూపించిన సమయంలో గోవిందనామస్మరణ చేశారు. ఈ ఏడాది అంచనాలకు మించి భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దీంతో చాలామంది నిల్చొని ఎల్‌ఈడి స్క్రీన్‌లలో కార్యక్రమాన్ని తిలకించారు. రాజంపేట పట్టణం నుంచే కాక వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీవారిసేవా సమితి ప్రతినిధులు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.
కమనీయం..శ్రీవారి కల్యాణం


