
అవసరాన్ని మించి ఒప్పందాలెందుకు?
డిమాండ్‌కు మించి విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని వైఎస్సార్ సీపీ సభ్యుడు మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
వైఎస్సార్‌సీపీ సభ్యుడు మేకపాటి గౌతంరెడ్డి
హైదరాబాద్: డిమాండ్‌కు మించి విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని వైఎస్సార్ సీపీ సభ్యుడు మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో ఉం దని చెబుతూ మరోవైపు అవసరాన్ని మించి విద్యుత్ కొనడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించారు. విద్యుత్తు చార్జీల పెంపుపై మంగళవారం అసెంబ్లీలో సీఎం ప్రకటన అనంతరం జరిగిన చర్చలో గౌతంరెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ర్టంలో విద్యుత్ సరఫరాకు, డిమాండ్‌కు మధ్య ఉన్న తేడా 5,000 ఎం.యూ. మాత్రమే. అయితే ప్రభుత్వం 16,000 ఎం.యూ. విద్యుత్‌ను కొంటోంది.
వాస్తవ కొరత 5,000 ఎం.యూ. అయితే 16 వేల ఎం.యూ. కొనుగోలుకు ఒప్పందాలు చేసుకోవడం నిజం కాదా! ఎందుకిలా 11,000 ఎం.యూ. విద్యుత్‌ను అధికంగా కొనుగోలు చేస్తున్నారు? దీని వెనకున్న మతలబు ఏమిటీ? విభజనవల్ల రాష్ట్రం కష్టాల్లో ఉండి, సంక్షేమ కార్యక్రమాల అమలు కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో ఇలా అనవసరపు వ్యయం చేయడంలో అర్థమేమిటీ? అనవసరంగా కొని పడే భారాన్ని ఇలా ప్రజలపై రుద్దుతారా..?’’ అని సీఎంపై గౌతంరెడ్డి ప్రశ్నలవర్షం కురిపించారు. ‘‘ప్రపంచబ్యాంక్ ఆదేశాలను అమలు చేయడమే బాబు చేసిన సంస్కరణలు. 1994 నుంచి 2004 వరకూ బాబు పాలనలో ప్రభుత్వ రంగంలో వచ్చిన అదనపు విద్యుదుత్పత్తి 710 మెగావాట్లు మాత్రమే. అదే 2004-2014 మధ్య 4,500 మెగావాట్ల విద్యుదుత్పత్తిని అదనంగా అందుబాటులోకి తెచ్చారు’’ అని గౌతంరెడ్డి గణాంకాలతో సహా వివరించారు.