ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకి | Babu Anti for special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకి

Oct 25 2015 8:57 AM | Updated on Mar 23 2019 9:10 PM

చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా వ్యతిరేకి అని ప్రముఖ దళిత తత్వవేత్త కత్తి పద్మారావు అన్నారు.

‘సాక్షి’ ఇంటర్వ్యూలో దళిత తత్వవేత్త కత్తిపద్మారావు

పొన్నూరు:
‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరుతో  ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి బడా కాంట్రాక్టర్లకు, విదేశీ కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ  ప్యాకేజీ పాట పాడుతున్నారు.’ అని దళిత తత్వవేత్త కత్తి పద్మారావు ధ్వజమెత్తారు. ‘హోదా’పై బాబు అనుసరిస్తున్న కప్పదాటు వైఖరి, ప్రత్యేక హోదా సాధనతో కలిగే ప్రయోజనాలపై ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ విషయాలు చంద్రబాబుకు తెలియవా?
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక హోదాపై కేంద్రానికి ఎన్ని లేఖలు రాశారు? ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు సామాన్యులకు కూడా తెలుసు. చంద్రబాబుకు తెలియదా? ఆయన మాత్రం ప్రత్యేక ప్యాకేజీ పాట పాడుతున్నారు.  వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. పారిశ్రామిక వాడల ఊసేలేదు. అవి అభివృద్ధి చెందితే సంపద సృష్టించగలం. అయితే 13 జిల్లాల్లో ఎక్కడా ఆ ప్రయత్నాలు జరగడం లేదు. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో హరిత విప్లవం, క్షీర విప్లవం, నీటి విప్లవం పూర్తిగా దెబ్బతిన్నాయి. పశువుల కొనుగోలుకు రుణాలు ఇస్తున్నా వాటికి గ్రాసం లభ్యం కాని పరిస్థితి. ఆస్ట్రేలియాలో వందల ఎకరాల్లో పశుగ్రాసం పెరుగుతోంది. రాష్ట్రంలో పశుగ్రాసం పెంచడానికి భూమి ఇవ్వలేదు. క్షీర విప్లవం ఏ విధంగా సాగుతుంది?

పరిశ్రమలొస్తే నిరుద్యోగం ఉండదు..
దేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో పరిశీలించకపోవడం దురదృష్ణకరం. పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది. ఉత్పత్తులు పెరిగి అమ్మకాల ద్వారా సంపద సృష్టించుకొనే అవకాశం కలుగుతుంది. అయితే బాబు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. జర్మనీ, జపాన్, సింగపూర్, చైనా, మలేషియాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రంతో రాష్ట్రానికి అవసరమైన వనరులు సమకూర్చే విషయంలో అనుబంధం తగ్గింది. రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్, హిందూ అజెండాపై మోదీతో అంతర్లీనంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశీ పర్యటనలు కాకుండా అదే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద చూపితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కేది.

జలరవాణాపై చిన్నచూపు..
రాష్ట్రానికి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అద్భుతమైన తీరరేఖ ఉంది. దీనికి తోడు విస్తారంగా నదులు ఉన్నాయి. ఈ క్రమంలో జలరవాణాపై దృష్టి సారించకుండా విమానయానం వైపు చూస్తున్నారు. విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికల రూపకల్పన చేస్తున్నారు. నౌకాయానాలు పెంచుకోవడం ద్వారా రవాణా ఖర్చు తగ్గి విదేశీ మారకద్రవ్యం పెరుగుతుంది. నాడు సుగంధ ద్రవ్యాల కోసం ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. అందుకే అనేక ఓడరేవులను ఆంగ్లేయులు ఏర్పాటు చేశారు. ఓడ-రేవు స్పృహే చంద్రబాబుకు లేదు. ఆయన దృష్టంతా బయట నుంచి వస్తున్న డబ్బు పైనే. బడా వ్యాపారులైన గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కంభంపాటి రామ్మోహనరావు, సీఎం రమేశ్, సుజనాచౌదరి వంటి వారిపై ఉంది. 2019 ఎన్నికలను పొలిటికల్ ఎలక్షన్‌గా మార్చి ఓటుకు రూ.5 వేలు ఇచ్చి అయినా గెలవాలని తాయపత్రయపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనించాలి. ప్రత్యేక హోదా కోసం గళం విప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement