అడిగింది ఇవ్వరా.. | Asked to give a .. | Sakshi
Sakshi News home page

అడిగింది ఇవ్వరా..

Feb 17 2014 2:11 AM | Updated on Sep 2 2017 3:46 AM

అడిగింది ఇవ్వరా..

అడిగింది ఇవ్వరా..

పని కోసం వచ్చిన వారిని పదేపదే తిప్పించుకోవడం అలవాటుగా మార్చుకున్న రెవెన్యూ శాఖకు సమాచార హక్కు చట్టంతో ఓ సామాన్యుడు షాక్ ఇచ్చాడు.

  •     ‘సమాచార హక్కు’ పట్టని రెవెన్యూ శాఖ
  •      రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు
  •      నేడు కమిషన్ ముందుకు జేసీ, డీఆర్‌ఓ
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : పని కోసం వచ్చిన వారిని పదేపదే తిప్పించుకోవడం అలవాటుగా మార్చుకున్న రెవెన్యూ శాఖకు సమాచార హక్కు చట్టంతో ఓ సామాన్యుడు షాక్ ఇచ్చాడు. బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో అక్రమాలపై విచారణ నివేదికను ఇచ్చే విషయంలో రెవెన్యూ శాఖ వహించిన నిర్లక్ష్యం... ఇప్పుడు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

    సమాచారం హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని దరఖాస్తుదారుడికి గడువులోపు ఇవ్వనందున ఈ నెల 17న స్వయంగా హాజరుకావాలని రాష్ట్ర సమాచార కమిషన్ వారిని ఆదేశించింది. జనవరి 27న ఉత్తర్వులు రాగా... జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్.సురేందర్‌కరణ్‌లు సోమవారం రాష్ట్ర సమాచార కమిషన్ ముందు హాజరుకానున్నారు.
     
    ఇదీ.. నేపథ్యం
     
    ఆత్మకూరు మండలం బ్రాహ్మణపల్లిలో పట్టాదారు పాసుపుస్తకాల జారీలో అక్రమాలు జరి గాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యా దు చేసినా... రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఈ అంశంపై లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలైంది. లోకాయుక్త ఆదేశాల మేరకు శిక్షణలో ఉన్న ఐఏఎస్ చక్రధర్‌బాబు విచారణ చేపట్టారు. పట్టాదారు పాసుపుస్తకాల జారీలో అక్రమాలు, ఇందులో రెవెన్యూ అధికారుల పాత్రపై నివేదిక(ఎఫ్5718/2012) ఇచ్చారు. 524 పేజీలు ఉన్న నివేదిక (ఫైల్)ను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాలని హన్మకొండకు చెందిన పొట్లపల్లి వీరభద్రరావు 2013 జూలై 8న దరఖాస్తు చేసుకున్నారు.

    రెవెన్యూ అధికారులు కేవలం 216 పేజీలే ఇచ్చారు. విచారణ నివేదికలోని మొత్తం 524 పేజీల సమాచారం ఇవ్వాలని పిటిషన్‌దారు మరోసారి 2013 ఆగస్టు 14న దరఖాస్తు పెట్టారు. రెవెన్యూ అధికారుల నుంచి స్పందన రాలేదు. అధికారుల తీరుతో విసిగిపోయిన దరఖాస్తుదారుడు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులను సంప్రదించారు. అయినా... సమాచారం ఇవ్వలేదు. పైగా సమాచారం ఇస్తాం... ఫలనా రోజు కలెక్టరేట్‌కు రావాలని దరఖాస్తుదారుడికి పదిసార్లు లేఖలు పంపారు.

    ఈ మేరకు వీరభద్రరావు కలెక్టరేట్‌కు వెళితే... ఏదో ఒక కారణం చెప్పి సమాచారం ఇవ్వకుండా వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌ను సంప్రదించారు. విషయాన్ని పరిశీలించిన కమిషన్... సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. రెవెన్యూ శాఖకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులుగా ఉన్న జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. దరఖాస్తుదారుడు పిటిషన్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సమాధానాలతో రావాలని ఆదేశాల్లో పేర్కొంది.
     

Advertisement
 
Advertisement
Advertisement