సంక్రాంతికి ‘సహకారం’ లేనట్లేనా?

APSRTC Not Giving CCS Loans To Employees - Sakshi

ఆర్టీసీ ఉద్యోగులకు అందని రుణాలు

జీతాల నుంచి ప్రతి నెలా 8 శాతం కోత

ఆ నగదును క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీకి  జమచేయని యాజమాన్యం

తత్ఫలితంగా నష్టాల బాటలో సొసైటీ

‘సంక్రాంతి’ ఎలా జరుపుకోవాలంటూ సతమతం

సాక్షి, అమరావతి బ్యూరో: ఆపదలో అక్కరకొస్తుందనే ఉద్దేశంతో ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు వారి సొంత నగదుతో ఏర్పాటు చేసుకున్న   క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ(సీసీఎస్‌)కి  ఆర్టీసీ యాజమాన్యం వాత పెడుతోంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి కోత విధిస్తున్న నగదును సీసీఎస్‌కు చెల్లించకుండా  సొంత అవసరాలకు వాడుకుంటోంది. ఫలితంగా ఉద్యోగులకు  సకాలంలో సీసీఎస్‌ రుణాలు అందక  నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

ఏం జరుగుతుందంటే.. 
ఆసియాలో అతిపెద్ద రవాణా రంగ సంస్థగా గుర్తింపు ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల మూలవేతనం నుంచి 8 శాతం కోత విధించి సీసీఎస్‌లో జమ చేస్తారు. ఇలా దశాబ్దాల కాలంగా  సొసైటీ నిర్వహణ జరుగుతుంది. సుమారు రూ.1200  కోట్ల టర్నోవర్‌తో నడిచే ఈ సొసైటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54 వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. కుటుంబ అవసరాలకోసం నగదు అవసరమైనప్పుడు దరఖాస్తు చేసుకుంటే గతంలో 24 గంటల లోపే రుణం మంజూరు చేసేవారు. దీంతో ఉద్యోగులు నెలవారీగా చెల్లింపులు చేసుకునేవారు.ఇలా  సీసీఎస్‌ లాభాల బాటలో నడుస్తూ ఉద్యోగుల అవసరాలు తీరుస్తోంది.

ఆర్టీసీ అప్పుల వల్ల..
నాలుగేళ్లుగా ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. ప్రభుత్వ పరంగా సరైన ఆర్థిక తోడ్పాటు ఇవ్వకపోవడం, పెరుగుతున్న డీజిల్‌ ఖర్చులతో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం సంస్థ అవసరాల కోసం ప్రతినెలా ఉద్యోగుల నుంచి సేకరించే నగదును సీసీఎస్‌కు జమచేయకుండా వాడుకుంటోంది. ఇప్పటికే సంస్థ దాదాపు రూ.215 కోట్లను సీసీఎస్‌కు జమ చేయలేదు. అలాగే దాదాపు రూ.7 కోట్లు వడ్డీ రూపంలో కూడా జమ చేయాల్సి ఉంది. మొత్తం మీద సీసీఎస్‌కు రూ.222 కోట్లు సంస్థ బకాయి పడింది. 

నష్టాల పాలవుతున్న సొసైటీ..
ఆర్టీసీ యాజమాన్యం ప్రతినెలా సీసీఎస్‌కు జమ చేయాల్సిన నగదు ఇవ్వకపోవడంతో ప్రతినెలా వడ్డీ రూపంలో  రూ.1.5 కోట్లు నష్టం వాటిల్లుతోంది. దశాబ్దాల కాలంగా లాభాల్లో నడిచే సీసీఎస్‌ ఆర్టీసీ తీరు వల్ల నష్టాల బాట పడుతుందని  ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండుగ ఎలా జరుపుకోవాలి?
ప్రతినెలా  ఉద్యోగుల నుంచి సేకరించే నగదు జమకాక పోవడంతో నష్టాల్లో ఉన్న సీఎసీఎస్‌  ఉద్యోగుల సొంత అవసరాల కోసం రుణాలను సకాలంలో అందివ్వలేకపోతుంది. గతంలో  దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లోపే రుణం సౌకర్యం కల్పించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గతేడాది డిసెంబర్‌ 13 నుంచి రుణాలు ఇవ్వలేకపోయారు. దీంతో సంక్రాంతి పండుగ సమయంలో  కుటుంబ అవసరాల కోసం రుణం కోసం దరఖాస్తు  చేసుకున్న ఉద్యోగులు సతమతమవుతున్నారు.

సొసైటీని కాపాడుకునేందుకు ఉద్యమం
సీసీఎస్‌కు ప్రతి నెలా జమ చేయాల్సిన నగదును యాజమాన్యం సొంత అవసరాలకోసం వాడుకుంటోంది. దీనివల్ల  ఉద్యోగులకు రుణాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే యాజమాన్యం సీసీఎస్‌కు జమ చేయాల్సిన నగదు చెల్లించి నష్టాలు రాకుండా చూడాలి.  లేని పక్షంలో సొసైటీని కాపాడుకునేందుకు ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది.
–పలిశెట్టి దామోదరరావు, ఈయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top