సంక్రాంతి సినిమాల సందడికి అంతా సిద్ధమైంది. పొంగల్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్. సంక్రాంతికి వచ్చే చిత్రాలు ఏడాది ముందే కర్ఛీఫ్ వేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ పండుగకు స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే పెద్ద హీరోల మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ పోటీని తట్టుకోవడం కష్టం. టాలీవుడ్‌లో మన సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉంటుంది. డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.
సినిమా రిలీజ్ డేట్స్ కోసమే పోటీ ఉండే సంక్రాంతి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం విడుదల తేదీల కోసమే ఇంత పోటీ ఉంటే థియేటర్ల సంగతేంటి? అన్ని చిత్రాలకు సమానంగా స్క్రీన్స్ దొరుకుతాయా? ఈ విషయంలో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. మన టాలీవుడ్ సినిమాల డేట్స్, థియేటర్స్ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి ఈ సమయంలో డబ్బింగ్ చిత్రాలు సైతం క్యూలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి పరశక్తి, జన నాయగణ్ లాంటి స్టార్స్ సైతం పొంగల్ బరిలో ఉన్నారు. ఇక్కడే మన తెలుగు ఆడియన్స్‌తో పాటు నెటిజన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
సంక్రాంతికి థియేటర్ల కొరత..
ఈ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. వాటిలో ప్రభాస్ ది రాజాసాబ్ జనవరి 9న రానుంది. ఆ తర్వాత జనవరి 10న డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా , మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇంత పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా రావడం థియేటర్ల సమస్యకు కారణమవుతోంది.
డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు?
సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్ సినీ ప్రియులు మండిపడుతున్నారు. పరాశక్తి, జననాయగణ్ చిత్రాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నస్తున్నారు. మన చిత్రాలకు కోలీవుడ్‌లో పెద్దగా ఆదరించరని అంటున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ ఉండదని అన్నారు. ఈ విషయంపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బిగ్ కాంపీటీషన్ ఉండే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్‌పై మరోసారి ఆలోచిస్తే మంచిదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. లేదంటే ఈ థియేటర్ల సమస్య ప్రతి ఏటా రిపీట్ అవుతూనే ఉంటుంది. సంక్రాంతికి కాకుండా ఓ వారం రోజుల తర్వాత డబ్బింగ్ చిత్రాలు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


