ప్రసూతి సేవలు ప్రత్యేకంగా..

AP Govt made alternate arrangements for Maternity services - Sakshi

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

గర్భిణుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యారోగ్య శాఖ

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజా, ప్రైవేటు రవాణా స్తంభించింది. మరోవైపు వైద్యులంతా కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి, పాజిటివ్‌ వ్యక్తులకు వైద్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రసవాలకు వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ సమయంలోనైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గర్భిణులు ప్రసవం కోసం వస్తే అత్యవసర సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. 108 అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను పకడ్బందీగా నిర్వహిస్తోంది. 108 సేవలకు ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ వెళ్లి గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రసవానంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో బాలింతను, బిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. 

ఐదు ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ పేషెంట్లున్న ఐదు జిల్లా ఆస్పత్రుల్లోనే ప్రసూతి సేవలకు ఇబ్బంది ఉంది. నంద్యాల, హిందూపురం, మచిలీపట్నం వంటి ఆస్పత్రుల్లో రోజుకు 20కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఆ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల్ని ఇప్పుడు సమీప సీహెచ్‌సీలకు పంపిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఏ ఆస్పత్రిలోనూ ప్రసూతి సేవలకు ఇబ్బంది లేదు. విపత్కర పరిస్థితులున్నాయి కాబట్టి గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్‌ బృందంతో కూడిన వైద్యులను అందుబాటులో ఉంచుతున్నాం. 
–డాక్టర్‌ యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధాన పరిషత్‌ 

బోధనాస్పత్రుల్లో సేవలు యథాతథం 
నెల్లూరు, తిరుపతి, విజయవాడలోని బోధనాస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చాం. వీటిలో మెటర్నిటీ వార్డులు ప్రధాన ఆస్పత్రికి దూరంగా.. ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి కాన్పులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ సమయంలో ప్రసవానికి వచ్చినా డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మిగతా 8 బోధనాస్పత్రుల్లోనూ ఎప్పటికప్పుడు ప్రసవాలపై సమీక్షిస్తున్నాం. డెలివరీలు, పీడియాట్రిక్‌ సేవలు, క్యాజువాలిటీ సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా వైద్యులు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చాం. 
– డాక్టర్‌ కె.వెంకటేష్,డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌

24 గంటలూ అందుబాటులో.. 
► రాష్ట్రంలో 195 సీహెచ్‌సీలు, 38 ఏరియా ఆస్పత్రుల్లో 24 గంటలూ ప్రసూతి సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
► ప్రజా రవాణా అందుబాటులో లేని కారణంగా 108కు ఎప్పుడు కాల్‌ చేసినా వచ్చేలా ఆదేశాలిచ్చారు.
► ఎవరైనా సొంత వాహనంలో ప్రసూతి సేవలకు వెళ్తుంటే.. అడ్డుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు  పోలీసులకు సూచనలిస్తున్నారు.
► ప్రైవేట్‌ ఆస్పత్రులు సైతం ఎలాంటి సమయంలోనైనా గర్భిణులకు తక్షణ వైద్య సేవ లందించేలా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది.
► మార్చి నెలలో 108 అంబులెన్స్‌ సేవలను 9,610 మంది గర్భిణులు ఉపయోగించుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top