కనీసం నీళ్లివ్వకపోతే ఎలా..? | Sakshi
Sakshi News home page

కనీసం నీళ్లివ్వకపోతే ఎలా..? 

Published Mon, Jun 29 2020 11:09 AM

Anantapur Joint Collector Serious On Hospital Superintendent Over Corona - Sakshi

సాక్షి, అనంతపురం : ‘కరోనా బాధితులు తీవ్ర భయాందోళనల్లో ఉంటారు. అలాంటి వారికి మనమే రక్షణగా ఉండాలి. సక్రమంగా సేవలందించాలి. అలాంటిది కనీసం వారికి తాగునీరు కూడా అందించకపోతే ఎలా...? మీరు చెప్పండి... నిజంగా ఈ వార్డులో కనీస మౌలిక సదుపాయాలున్నాయా...? ఒక్క రోజు మీరిక్కడుండి తర్వాత మాట్లాడండి’ అంటూ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్, ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయమ్మపై జాయింట్‌ కలెక్టర్‌ అట్టాడ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఇస్త్రీ బట్టల్లో రూ.5 లక్షల బంగారం దొరికినా..)

సర్వజనాస్పత్రిలో కరోనా బాధితుల వెతలపై ‘మేమిక్కడ ఉండలేం బాబోయ్‌’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం వెలువడిన కథనంపై కలెక్టర్‌ గంధం చంద్రుడు స్పందించారు. అక్కడున్న పరిస్థితులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలంటూ జేసీ సిరిని ఆదేశించారు. దీంతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌తో కలిసి ఆదివారం ఉదయం ఆమె సర్వజనాస్పత్రిని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఐడీ వార్డులో రోగులనుభవిస్తున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పత్రికలు ఎండగట్టవా అంటూ సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలపై మండిపడ్డారు. (తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌)

నేరుగా ఐడీ వార్డులోకి జేసీ.. 
ఐడీ వార్డులో ఉన్న రోగుల వద్దకు వెళ్లేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది వెనుకంజ వేస్తున్న ప్రస్తుత తరుణంలో జేసీ సిరి ధైర్యంగా నేరుగా ఐడీ వార్డులో కాలు పెట్టారు. ఆ సమయంలో ఆస్పత్రిలోని ఉన్నతాధికారులు సైతం ఆమె వెంట లోపలకు వెళ్లేందుకు భయపడ్డారు. కరోనా బాధితుల వద్దకే వెళ్లి నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను చాలా ఓపిగ్గా విన్నారు. వార్డులో నీటి సౌకర్యం లేకపోవడం, మౌలిక సదుపాయాలు లోపించడం గుర్తించారు. ఊపిరాడడం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేయగా.. కిటికీలు తీయించారు. ఇద్దరు రోగులు ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి, వారిని ఐసోలేషన్‌ వార్డుకు మార్చాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. అనంతరం కోవిడ్‌ ఎస్‌ఆర్‌ క్వార్టర్స్, ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించారు. (ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత )

నిరంతరం సేవలందాలి.. 
కరోనా పాజిటివ్‌ కేసులు, అనుమానితులకు  నిరంతరం సేవలందాలని వైద్య సిబ్బందిని జేసీ ఆదేశించారు. రోగులకందించే డైట్‌ మెనూలో మార్పులు చేయాలన్నారు. మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రతి గదిలోనూ మూడు వాటర్‌ క్యాన్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. వార్డులను వీలైనన్ని ఎక్కువసార్లు శుభ్రం చేయించాలన్నారు. డ్యూటీ వైద్యులెవరు...? కింది స్థాయి సిబ్బంది డ్యూటీలో ఎవరుంటారన్న బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.  మరోసారి పరిశీలనకు వచ్చినప్పుడు ఇవే తప్పులు కనిపిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు.  

సదుపాయాలు మెరుగుపరుస్తాం  
ఆస్పత్రిలోని ఐడీ వార్డులో సమస్యలున్న మాట వాస్తవమే. వీటిని మరింత మెరుగుపరుస్తాం. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారిని ఐసోలేషన్‌లోకి మార్చాలని ఆదేశించా. ఒక్కో షిప్టులో మూడు క్యాన్‌ల ప్యూరిఫైడ్‌ వాటర్‌ను ఉంచాలని చెప్పాం. ప్రస్తుతానికి డైట్‌ ఒకే కానీ, అందులో మరింత నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నాం. శానిటేషన్‌లోనూ మరిన్ని మార్పులు తీసుకువచ్చి బాధితులకు మెరుగైన సేవలందిస్తాం.
– సిరి, జాయింట్‌ కలెక్టర్‌

Advertisement
Advertisement