తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌

Telangana Home Minister Mahmood Ali Tests Positive For Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోంమంత్రికి కరోనా టెస్టులు చేయగా వైరస్‌ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. 

కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న మంత్రి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు నేడు రాగా, అందులో ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ( చదవండి : కరోనా: 24 గంటల్లో 19 వేల కేసులు)

కాగా, రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లలో చికిత్స పొందుతుండగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నలుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది.

టిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం
తెలంగాణలో కరోనా పరిస్థితి, రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించింది. కరోనా నివారణ చర్యలపై ఆరా తీసింది. అనంతరం గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌ను కూడా కేంద్ర బృందం పరిశీలించింది. మధ్యాహ్నం కంటైన్‌మెంట్‌ దోమలగూడ దోబీగల్లీలో పర్యటించనుంది. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top