ఆనందం కొలువైంది | Allotement Letter To Grama Sachivalaya Jobs In Guntur | Sakshi
Sakshi News home page

ఆనందం కొలువైంది

Oct 1 2019 11:35 AM | Updated on Oct 1 2019 11:35 AM

Allotement Letter To Grama Sachivalaya Jobs In Guntur - Sakshi

మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకుంటున్న అభ్యర్థి

ఎటు చూసినా అభ్యర్థుల కోలాహలం.. అందరి మోముల్లో చెప్పలేని సంతోషం.. ఎన్నో ఏళ్ల కల సాకారమైందన్న సంబరం.. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తమ జీవితాల్లోకి ఆనంద క్షణాలు వచ్చాయని,  కష్టాలు తొలగిపోయాయన్న ధైర్యం.. ప్రభుత్వ ఉద్యోగం కల సాకారమైందన్న ఆనందం ప్రతి ఒక్కరిలో కనిపించింది. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల కోసం తరలి వచ్చిన అభ్యర్థులతో మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌ హాలులో పండుగ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమే తమకు ఉద్యోగాలు వచ్చేలా చేసిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహించి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే తమ ధ్యేయమన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఆసాంతం ఆనందోత్సాహాల నడుమ సాగింది. 

సాక్షి, అమరావతి :  ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అంటూ  అందరి కష్టాలను తీరుస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగి స్తున్న పాలన, ఆయన తీసుకొనే ప్రతి నిర్ణయం చారిత్రాత్మకమేనని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం సోమవారం మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న సీకే కన్వెన్షన్‌ హాలులో ఉత్సాహంగా సాగింది. శాసన సభ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అధ్యక్షతన కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్‌ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ  బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తెచ్చిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టి పూర్తిచేయడం ఒక అపూర్వ ఘట్టమని అన్నారు. టీడీపీ ఐదేళ్ల అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా సేవలు అందించే జగనన్న సైన్యమే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు అని అభివర్ణించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సాధ్యమైనంత త్వరలో భర్తీ చేసే శుభవార్తను త్వరలో అందిస్తామన్నారు.  
 
రాష్ట్ర భవిష్యత్తును సూచించే ఉన్నత వ్యవస్థ 
గ్రామ/వార్డు సచివాలయాలు రాష్ట్ర భవిష్యత్తును సూచించే ఉన్నతమైన వ్యవస్థగా హోం మంత్రి మేకతోటి సుచరిత అభివర్ణించారు.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లోనే చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశారని వివరిం చారు. సచివాలయాల ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు వారిపై లబ్ధిదారులకు కొండంత నమ్మకం ఏర్పడుతుందన్నారు.  రేషన్, పింఛన్‌ వంటి సమస్యలను 72 గంట ల్లోనే పరిష్కరించాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు ఎక్కువ మంది మహిళలే ఎంపికయ్యారని, వారికి భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా విధులు నిర్వర్తించాలని శాసన సభ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కోరారు. సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాలన్నా, వ్యవస్థలో లోపాలు సరిచేయాలన్నా ఈ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. 

వ్యవస్థలో మార్పు తేవాలి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించాలని సచివాలయాల ఉద్యోగులకు శాసనమండలి    చీఫ్‌విప్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలతో ఒక శకం మారబోతోందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలని ఉద్యోగులను కోరారు. 

గ్రామ స్వరాజ్యం చాలా ముఖ్యమైంది
గ్రామ స్వరాజ్యం కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌  మాట్లాడుతూ గ్రామ వలంటీర్లపైన మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవస్థలో మార్పు తెచ్చేం దుకు చిత్తశుద్ధితో శ్రమిస్తున్నారని అన్నారు. గ్రామస్వరాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో పదివేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీకి విజయవాడలో పలు మార్లు ధర్నా చేసినా ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 4 నెలల పాలనలోనే 1.26 లక్షల ఉద్యోగాలు కల్పిం చారని అభినందించారు.

పరీక్షలను పకడ్బం దీగా నిర్వహించిన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ రాజకీయాల్లో పారదర్శకతను ఆచరణలో తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. నీతివంతమైన పాలనను సాకారం చేసేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజ లకు ఇచ్చిన హామీలను విస్మరించగా, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారని స్పష్టంచేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను వమ్ము చేయకుండా కష్టపడి పనిచేయాలని సచివాలయాల ఉద్యోగులకు సూచించారు. రాష్ట్రంలో లంచాలు లేని పారదర్శక పాలనను తీసుకు రావడంలో భాగస్వాములు కావాలని కోరారు.

పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం ఒక ఊరిలోనే పది నుంచి 30 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో రాష్ట్రంలో దసరా, దీపావళి పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉందన్నారు. ఉద్యోగులు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కోరారు. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక కుటుంబం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబమని అన్నారు. వైఎస్‌ జగన్‌
మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజల బాధలు చూసి, వారి కష్టాలు తీర్చేదిశగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ గ్రామ, వార్డు వలంటీర్లందరూ పార్టీలకతీతంగా పనిచేయాలని కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్, ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నెహ్రూనగర్‌(గుంటూరు): సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్, డీఆర్‌డీఏ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ,  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు సూచించారు.  సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో డీఆర్‌డీఎ, స్కిల్‌ 
డెవలప్‌మెంట్‌ పోస్టర్లను ఆవిష్కరించారు.  

ఆనందంలో అభ్యర్థులు
విజయవాడలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగాన్ని సీకే కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటుచేసిన స్క్రీన్‌ ద్వారా తిలకించిన అభ్యర్థులు చప్పట్లు, కేరింతలతో సందడి చేశారు. ముఖ్యమంత్రి తీసుకొన్న సాహసోపేత నిర్ణయంతోనే తమకు ఉద్యోగాలు లభించాయనే భావన ప్రతి  ఒక్కరిలో నెలకొంది. సీఎం జగన్‌ ప్రసంగం వింటున్నంతసేపు, అభ్యర్థులతోపాటు హాజరైన వారి తల్లిదండ్రుల మోములు చిరునవ్వుతో కళకళలాడాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement