‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’

Adimulapu Suresh: SSc Exams Will Start After 2 Weeks Of Lockdown Close - Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపడతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. ఆన్‌లైన్‌, డిజిటల్‌ తరగతుల నిర్వహణ మరింత పెరగాలని కేంద్ర మంత్రి సూచించారు. విద్యా సంవత్సరంలోనే కాకుండా వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. (కరోనా టెస్టులు: దేశంలోనే ప్రథమ స్థానం..)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ కేంద్రమంత్రికి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేశామని మంత్రి తెలిపారు. ఈ మేరకు వారికి సహాయ సహకారాలు అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రానికి మరిన్ని కేజీబీవీ, మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో రేడియో, దూరదర్శన్ ద్వారా డిజిటల్, ఆన్ లైన్ క్లాస్‌లను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మౌలిక వసతులను బలోపేతం చేయాలని మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి ధోత్రే సంజయ్ శ్యాంరావును కోరారు. (హిట్‌ మీ ఛాలెంజ్‌.. నెటిజన్ల మండిపాటు )

రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపట్టనున్నట్లు, త్వరలోనే పదో తరగతికి పరీక్షల సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయననున్నట్లు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సమగ్రశిక్ష విధానంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1529 కోట్ల నిధుల్లో రూ.923 కోట్లు వచ్చాయని, మిగిలిన రూ.606 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక విద్యావిధానంలో భాగంగా దూరదర్శన్ ద్వారా  విద్యామృతం, ఆల్ ఇండియా రేడియో  ద్వారా విద్యాకలశం పేరుతో  విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందిస్తున్నామని మంత్రి సురేష్‌ తెలిపారు. (‌‘ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్న మొసలి’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top