గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధ్యేయం..
స్వచ్ఛాంధ్ర... సురక్షాంధ్రా లక్ష్యం
వచ్చే ఏడాది జూన్‌కు వెలిగొండ, అదే ఏడాది డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి
తీర ప్రాంతంలో శరవేగంగా కొత్త పోర్టుల నిర్మాణం
రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధన కోసం పది సూత్రాల ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. 77వ గణతంత్ర దిన రాష్ట్ర స్థాయి వేడుకలను రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు బలగాల పరేడ్‌ను తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా ఈ గణతంత్ర వేడుకలు చారిత్రక ఘట్టంగా నిలిచాయన్నారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధన కోసం పేదరిక నిర్మూలన(జీరో పావర్టీ), ఉపాధి కల్పన–నైపుణ్యాభివృద్ధి, జనాభా నిర్వహణ–మానవ వనరుల అభివృద్ధి, నీటిభద్రత, రైతు–అగ్రిటెక్, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు, ఇంధనం–పరిశ్రమలు, ఏపీ బ్రాండ్, స్వచ్ఛాంధ్ర–సురక్షాంధ్ర, డీప్‌టెక్–స్మార్ట్ ఆంధ్రా వంటి పది సూత్రాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు.
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఎల్రక్టానిక్ టాయ్, సోలార్, డ్రోన్, స్పేస్, బల్క్ డ్రగ్ సిటీలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి
పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ చెప్పారు. అదే ఏడాది జూన్ నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తి చేసి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి సాగు భూమికి నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాయలసీమను దేశానికే హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. గుంతలు లేని రోడ్ల లక్ష్యంతో పనులు వేగవంతం చేశామన్నారు.
జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని, రామాయపట్నం సహా 4 కొత్త పోర్టుల నిర్మాణం జరుతోందని అన్నారు. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ క్యాపిటల్‌గా రాష్ట్రం ఎదుగుతుందన్నారు. ‘మన మిత్ర’ ద్వారా వాట్సాప్‌లోనే 119 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన.. మొదటి స్థానంలో సాంస్కృతిక శాఖ శకటం
గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందేమాతరం రచించి 150 సంవత్సరాలైన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. మహిళా సంక్షేమం, పరిశ్రమల శాఖ శకటాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చాయి. కవాతులో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్‌కు మొద టి స్థానం, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలి యన్ రెండోస్థానం పొందాయి. కేరళ రాష్ట్ర పోలీస్ కంటింజెంట్‌కు ప్రోత్సాహక బహుమతి లభించింది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


