కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review Meeting On Covid 19 Preventive Measures Today - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కరోనా సమాచారం గురించి వివరాలు అందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 80,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని..  గడచిన 24 గంటల్లో 82 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఇక కోవిడ్‌-19 పరీక్షల నిర్వహణలో అధిక సగటు నమోదుతో  దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సగటు 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే దేశంలో మరణాల రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే.. ఏపీలో 2.46 శాతం అని వెల్లడించారు. ఇక ఈ కేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్లనుంచే వస్తున్నాయని స్పష్టం చేశారు. అదే విధంగా శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబ్‌లు సిద్ధం అవుతున్నాయని... విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ల్యాబ్‌ల ఏర్పాటుపై కూడా దృష్టిపెడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకు స్పందించిన అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు.(ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు)

వ్యవసాయం అనుబంధ రంగాలపై సమీక్ష
రాష్ట్రంలోని వివిధ పంటల మార్కెటింగ్, ధరలు అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మొక్కజొన్న, శెనగ, ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చించారు. బయట రాష్ట్రాల్లో మార్కెట్లు తెరిచారా? లేదా? మన రాష్ట్రం నుంచి అక్కడకు రవాణా అవుతుందా? లేదా? అక్కడ విక్రయాలు ఎలా ఉన్నాయి? వాటి ధరలతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి వివరాలతో రావాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎక్కడ రైతులకు ఇబ్బందులు వచ్చినా.. అక్కడ జోక్యం చేసుకుని రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అగ్రి ప్రాసెసింగ్‌లో సమస్యలు చాలా వరకు తొలగిపోయాయన్న అధికారులు... ఫాంగేట్‌ పద్ధతిలో ధాన్యం కొనుగోలు స్టెబిలైజ్‌ అవుతుందని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా తల్లి రొయ్యలు, రొయ్యపిల్లల కొరతపై సమావేశంలో చర్చకు రాగా.. ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top