
తాడిపత్రిలో మొహరించిన పోలీసు బలగాలు
అనంతపురం సెంట్రల్: తాడిపత్రిలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసుశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాయలసీమ రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ రంగంలోకి దిగారు. తాడిపత్రి రూరల్ మండలం పొద్దపొలమడ గ్రామంలో పరిస్థితి అదుపుతప్పడం... గొడవలను మరింత రాజేసేలా అక్కడి నాయకులు ప్రవర్తిస్తుండటంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు తాడిపత్రికి చేరుకుంటున్నాయి. రాయలసీమ రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్‌వి రాజశేఖర్‌బాబులకు శాంతిభద్రతల బాధ్యతలను చూస్తున్నారు. వీరితో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి స్పెషల్‌పార్టీ బలగాలను రప్పించారు. సోమవారం కడప, కర్నూలు నుంచి కూడా ప్రత్యేక బలగాలు తాడిపత్రికి చేరుకుంటున్నాయి.
సెక్షన్ 144, 30 యాక్ట్
శాంతిభద్రతలు చెయ్యి దాటిపోవడంతో తాడిపత్రి మండల పరిధిలో 144 సెక్షన్, 30 యాక్టును అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలిచ్చారు.
అడుగడుగునా పోలీసుల వైఫల్యం
పొద్దపొలమడ గ్రామంలో ప్రబోధానంద ఆశ్రమ భక్తులు, జేసీ వర్గీయుల మధ్య గొడవలు జరగడానికి పోలీసుల వైఫల్యమనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదు.. కానీ పొద్దపొలమడ గ్రామంలో అనుమతివ్వడం.. విగ్రహాల ఊరేగింపు సమయంలోనైనా జాగ్రత్తలు తీసుకోకపోవడం.. జేసీ వర్గీయులు ఆశ్రమంపైకి వెల్లేంత వరకూ పోలీసులు జోక్యం చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.