మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు..అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన ఓ యువతికి చిన్నతనంలోనే మెదడు వాపు వ్యాధికి గురైంది. మానసిక ఎదుగుదల లేకపోవడంతో తల్లిదండ్రులు తమ వద్దనే ఉంచుకుని సాకుతున్నారు. ప్రతి రోజు ఇంటికి సమీపంలోని ఎడ్ల చావిడి వద్దకు వెళ్లి కొద్దిసేపు గడిపి రావడం అలవాటు.
ఈ క్రమంలో చావిడి పక్కనే నివసించే రేవెళ్ల విజయబాబు, సదరు యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. కొన్నాళ్లకు యువతి పొట్ట పెద్దగా అవుతుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు ఆమెను వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అని తేలింది. దీంతో వారు బాధితురాలిని విచారించగా..విజయబాబు ఇంటికి తీసుకెళ్లి అతనే అని చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కేసు బుధవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన అడిషనల్ అసిస్టెంట్ జడ్జి కె.రాధారత్నం నిందితుడికి 10 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.