అక్రమాలకు పాల్పడితే అధికారులకు జైలు తప్పదు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు పాల్పడితే అధికారులకు జైలు తప్పదు

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

● స్క్రూటినీ ప్రక్రియను వీడియో తీయాలని హైకోర్టు ఆదేశించింది

● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లతోపాటు ప్రస్తుతం అభ్యర్థుల స్క్రూటినీకి హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలతో గ్రామ పంచాయతీల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోలీసులు అనుమతించారని తెలిపారు. వార్డు సభ్యుల నామినేషన్లపై కోర్టు ఉత్తర్వులు లేని కారణంగానే వేయడానికి అంగీకరించ లేదన్నారు. 30 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారని, దాదాపు 400 మంది వార్డు మెంబర్లు నామినేషన్లు వేయాల్సి ఉండగా చాలా మందిని వేయించలేదన్నారు. నంద్యాల కొండారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, బచ్చల ప్రతాప్‌, పర్లపాడు మహేశ్వర్‌రెడ్డి రౌడీల్లా వ్యవహరించారని తెలిపారు. కామనూరు, కొర్రపాడు గ్రామ పంచాయతీలు తప్ప మిగతా చోట్ల తమ అభ్యర్థులు నామినేషన్లు వేశారన్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులు కొండారెడ్డి, వంశీనాథ్‌, నాయక్‌, శ్రీకాంత్‌తోపాటు డీఎస్పీ బాలస్వామిరెడ్డి టీడీపీ నేతల చేత దూషించబడ్డారన్నారు.పెద్దశెట్టిపల్లె, కొత్తపల్లె పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారన్న అక్కసుతో డీఎస్పీ బాలస్వామిరెడ్డితో పాటు ఇతర పోలీసు అధికారులను టీడీపీ నేతలు నంద్యాల కొండారెడ్డి, పర్లపాడు మహేశ్వరరెడ్డి బూతులు తిడుతూ దూషించారని ఆరోపించారు.కొత్తపల్లె సర్పంచ్‌ పదవిని ఇప్పిస్తామని నంద్యాల కొండారెడ్డి రూ.5 కోట్లకు బేరం పెట్టారని, ఎన్నిక జరిగితే ఆ పదవి ప్రజల చేతికి వెళుతుందనే భయంతోనే అధికారులపై చిందులు తొక్కారని విమర్శించారు. గోపవరం పంచాయతీలో వందలాది మంది రౌడీలను మోహరించి తమ అభ్యర్థులను మూడు రోజుల పాటు నరకం చూపించారని, కేవలం 11 మంది వార్డు సభ్యులతో మాత్రమే నామినేషన్లు వేయించారన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి డీజీపీగా, కొండారెడ్డి డీఐజీగా, మహేశ్వరరెడ్డి ఎస్పీగా వ్యవహరిస్తున్నారని రాచమల్లు ఎద్దేవా చేశారు. ప్రజాసేవ చేయాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు టీడీపీ నేతలకు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు అడిగే ధైర్యం లేకనే టీడీపీ నేతలు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని, భవిష్యత్తులో దేవుడు అవకాశం ఇస్తే అరాచకాలకు పాల్పడిన వారందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు.

అధికారులను జైలుకు పంపిస్తా

ప్రస్తుతం తమ అభ్యర్థులు స్క్రూటినీకి పంపేందుకు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు రాచమల్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే నామినేషన్‌కు అనుమతించారని, స్క్రూటినీపై కూడా కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి స్క్రూటినీని వీడియో రికార్డు చేసి పంపాలని కోర్టు సూచించిందన్నారు. ఈ ప్రకారం పోలీసులు అభ్యర్థులను స్క్రూటినీకి పంపుతారని, లోపల ఎన్నికల అధికారులు అన్యాయంగా నామినేషన్లను తిరస్కరిస్తే చర్యలు తప్పవన్నారు. బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ 259 ప్రకారం ఉద్యోగం పోవడంతో పాటు ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. పైగా ఎన్నికల అధికారులందరూ స్థానికులే కాబట్టి అన్యాయానికి పాల్పడినట్లు తెలిస్తే వారి ఇంట్లోనే ధర్నా చేస్తానని హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఇంతకంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు. పోలీసులు మాత్రం మనసు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement