చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని మామిళ్లపల్లె నారాయణరెడ్డిమఠం సమీపంలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతున్ని జరిపిటి శ్రీనివాసులు (28)గా గుర్తించారు. సోమవారం ఉదయం తన నివాసంలో కాలకృత్యాలకు వెళ్లిన అతను అక్కడే విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు వెల్లడించారు.
మార్చురీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనారోగ్య కారణాలతో ఈనెల 7న మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో కోలుకోలేక అతను సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు, బంధువులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపారు.
ఔషధ పరిశోధనలో
‘ఏఐ’ పాత్ర కీలకం
కడప ఎడ్యుకేషన్ : ఔషధ పరిశోధన, ఫార్మసీ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్ర కీలకమని అనంతపురం జేఎన్‌టీయూ ఓఎస్‌డీ ప్రొఫెసర్ దేవన్న, తిరుపతి మహిళా వర్సిటీ ప్రొఫెసర్ రమ్య కుబేర్ అన్నారు. కడప ఊటకూరు రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో ఐదు రోజుల ఎఫ్‌డీపీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ప్రొఫెసర్లు డాక్టర్ వీరేష్, రఘు, కళాశాల యాజమాన్యం గౌతమ్ రెడ్డి, జయ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ నెల్సన్ కుమార్, దీప, అధ్యాపకులు పాల్గొన్నారు.


