రాయచోటి : రాయచోటి నియోజకవర్గంలో మొదటి విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదటి రోజున తెలుగుదేశం పార్టీ నేతలు వారి అనుచరులు గుండాలు రెచ్చిపోయారు. తూముకుంట, దప్పేపల్లి సర్పంచ్ అభ్యర్థులపై దాడి చేసి, నామినేషన్ పత్రాలను చించివేయడం, మహిళలపై విచక్షణారహితంగా దాడి చేయడం, నోటికి వచ్చినట్లు మహిళలను దూషించారు.
ఎస్పీ పర్యవేక్షణ కొనసాగినా..
ఒకవైపు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియోజకవర్గ పరిధిలోని నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నా ఇంకోవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారి రౌడీ మూకల దౌర్జన్యా లు, దాడులు నిర్భయంగా నిరంతరాయంగా సాగాయి.
● లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట నామినేషన్ల కేంద్రంలోకి వెళ్లి దప్పేపల్లి పంచాయతీకి దాఖలైన నామినేషన్లను మంత్రి చించివేశారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామాపురం మండలం చిట్లూరు, రాయచోటి మండలం సిబ్యాల నామినేషన్ల కేంద్రాలలోకి మంత్రి ప్రవేశించి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను రానివ్వకుండా అడ్డుకోవాలంటూ తన పార్టీ వర్గాలకు హుకం జారీ చేశారు. కోనంపేట పంచా యతీ పరిధిలో వార్డులకు నామినేషన్లు వేయడానికి వచ్చిన మహిళలపై కూడా విచక్షణ రహితంగా టీడీపీ మూకలు నడిరోడ్డుపై దాడులకు తెగబడ్డారు.
● గాలివీడు మండలం వెలిగల్లు నామినేషన్ దాఖలు కేంద్రంలో మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, వారి అనుచరులు తూముకుంట సర్పంచ్ స్థానానికి దాఖలు చేస్తున్న వారి నామినేషన్లను లాక్కొని చించి వేశారు.
● తూముకుంట గ్రామంలో మహిళా అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాగి చించి వేయడంతో పాటు వారి పట్ల అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు.
● నూలువీడులో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను నామినేషన్ల కేంద్రాల వద్దకు రానివ్వకుండా వందలాదిమంది టీడీపీ గుండాలు స్వైర విహారం చేశారు. రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు జిల్లా సుదర్శన్ రెడ్డి ఇంటి పైకి టీడీపీ గుండాలు దాడికి తెగయించారు. గోరాన్ చెరువు పంచాయతీ కి నామినేషన్ల దాఖలు విషయం లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.
● రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల నామినేషన్ కేంద్రానికి వస్తున్న పెమ్మాడపల్లి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులపై వందల మంది టీడీపీ గూండాలు కర్రలు రాడ్లతో దాడులకు తెగబడ్డారు.
రహదారుల దిగ్బంధం..
సంబేపల్లి మండలం గురిగింజ కుంట నామినేషన్ కేంద్రం వద్ద గున్నికుంట్ల గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు దారులను నామినేషన్లకు రానివ్వకుండా టీడీపీ గుండాలు రోడ్లను నిర్బంధించారు. ఈ సమయంలో ఘర్షణ చోటుచేసుకోగా ఓ వృద్ధుడికి గాయాలయ్యాయి.
చిన్నమండెంలో భయం భయం..
మంత్రి సొంత మండలం అయిన చిన్నమండెం మండలంలో మొదటి రోజున నామినేషన్ల ప్రక్రియ భయం భయంగా సాగింది. నామినేషన్ల కేంద్రాల వద్ద టీడీపీ గుండాలు తిష్టవేయడంతో నామినేషన్ దాఖలుకు అభ్యర్థులు ముందుకు రాలేకపోయారు. నామినేషన్ల దాఖలకు ప్రత్యర్థులు ఎవరు వచ్చినా వారి భరతం పట్టాలని మంత్రి కుటుంబ సభ్యుల ఆదేశంతో మండల వ్యాప్తంగా రౌడీ మూకలు జీపులు, బైకులలో హల్‌చల్ చేశారు. దీంతో తొలి రోజున ప్రత్యర్థి పార్టీ నుంచి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.


