● జెడ్పీ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ
● టీడీపీ–బీజేపీ మధ్య పోటా పోటీ!
సాక్షి ప్రతినిధి, కడప: కడప జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ సీటు ఓసీ జనరల్ కేటాయించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి చైర్మన్‌గిరి అవకాశం దక్కినట్లే నని ఆపార్టీ శ్రేణులు భావించారు. మరోవైపు బీజేపీ మరింతగా బలపడాలంటే జెడ్పీ చైర్మెన్‌గిరి అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘పీఠ’ముడి వీడడం లేదు.
జెడ్పీటీసీల రిజర్వేషన్ల తర్వాత జెడ్పీ చైర్మన్ రేసులో టీడీపీ నుంచి పుత్తా నరసింహారెడ్డి పేరు ప్రముఖంగా విన్పించింది. ఆమేరకు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీల ఎన్నికలకు కావాల్సిన వ్యవహారాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. కమలాపురం, బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ పరిస్థితుల్లో చైర్మన్‌గిరి పుత్తా సొంతం చేసుకుంటారని పరిశీలకులు భావించారు.
అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఆది...
పద్మవ్యూహంలో పాండవులను నిలువరించినట్లుగా జెడ్పీ పీఠం అధిష్టించకుండా పుత్తా నరసింహారెడ్డిని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నిలువరిస్తున్నారని విశ్లేషకలు వెల్లడిస్తున్నారు. కాగా ఎన్నికలు నిర్వహిస్తే గెలవలేమని భావించిన అధికార పక్షనేతలు అధికారుల సహకారంతో ఏకపక్ష ఎంపికలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా పుత్తా వర్గీయులు నామినేషన్ కేంద్రం వద్ద మకాం వేసి మరీ బెదిరింపులతో.. అడ్డదారులతో పలువురు జెడ్పీటీసీల ఏకగ్రీవానికి కృషి చేశారు. ఇక చైర్మన్ సీటు తమకే దక్కుతుందని భావించిన తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే ఆది అడ్డుకట్ట వేస్తున్నారు. బీజేపీ మరింతగా బలపడాలంటే జెడ్పీ ఛేర్మెన్‌గిరి కేటాయించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. ఆమేరకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మంత్రి సత్యకుమార్ సహకారం దక్కినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకే ఒక జెడ్పీ చైర్మన్ బీజేపీకి కేటాయిస్తామంటే కడప కావాలంటూ పట్టుబటుతున్నారు. రెండు కేటాయించినా అందులో కడప ఉండాలంటూ పట్టుబట్టుతున్నారని విశ్వసనీయ సమాచారం.
పుత్తాను వెంటాడుతున్న దురదృష్టం...
మహానేత వైఎస్సార్ సహకారంతో 2004లో కమలాపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పుత్తా నరసింహారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహానేత వైఎస్సార్ పుత్తాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో 2008లో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పుత్తా టీడీపీలో చేరారు. 2009, 14, 19లో టీడీపీ అభ్యర్థిగా కమలాపురం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. వరుస ఓటమి నేపధ్యంలో 2024లో ఎమ్మెల్యే సీటు ఇచ్చేందు కు టీడీపీ అధిష్టానం నిరాకరించింది. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం పుత్తా నరసింహారెడ్డి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ‘కూటమి’ రూపంలో దురదృష్టం వెంటాడుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


