వలేటివారిపాలెం : మాలకొండ ఘాట్ మూడో మలుపు వద్ద మినీ ట్రాలీ అదుపు తప్పి బోల్తాపడటంతో 19 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాలు.. కడప జిల్లా మైదుకూరు నుంచి మినీ ట్రాలీలో 32 మంది భక్తులు కార్తిక మాసాన్ని పునస్కరించుకొని దర్శనం కోసం శుక్రవారం రాత్రి మాలకొండ చేరుకున్నారు. కొండ కింద ఉన్న దేవస్థానం గదుల్లో నిద్రపోయారు. శనివారం అదే ట్రాలీలో కొండకు చేరుకొని దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా మూడో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్సై బ్రహ్మయ్య తెలిపారు.
ఇరువర్గాల ఘర్షణ
కడప అర్బన్ : నగర శివారు చలమారెడ్డిపల్లె క్రాస్‌లోని స్వప్న వైన్స్ వద్ద శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చలమారెడ్డిపల్లెకు చెందిన తిరుపతి, వెంకటేష్, జగదీష్‌లకు.. శంకరాపురానికి చెందిన సంతోష్, సాయి మరో ముగ్గురికి మధ్య మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. ఈ ఘటనలో వెంకటేష్, జగదీష్‌లు గాయపడగా రిమ్స్‌కు తరలించారు. ఐదుగురిపై కేసు న మోదు చేసినట్లు చిన్నచౌక్ పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని
హెడ్ కానిస్టేబుల్ మృతి
నరసన్నపేట : కోమర్తి కూడలి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమర్తి గ్రామానికి చెందిన కింజరాపు రాజారావు(49) మృతి చెందారు. రాజారావు కడప బెటాలియన్‌లో పీఎస్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కోర్టు వ్యవహారం నిమిత్తం గురువారం నరసన్నపేట వచ్చారు. పని ముగించుకొని కోమర్తిలో తన బంధువులను కలిసి స్కూటీపై శ్రీకాకుళం వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే రాజారావు మృతి చెందారు. భార్య వెంకటలక్ష్మి విశాఖలో ఉంటుండగా ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి రోషిణి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నారు.


